
సాధారణంగా వరుస ప్లాప్‌ల్లో ఉన్న దర్శకులకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం చాలా కష్టం. ఒకవేళ ఇచ్చినా, ఆ దర్శకుడితో మరో ప్లాప్ పడుతుందేమో అన్న భయంతో చాలామంది హీరోలు సాహసం చేయరు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోతో సినిమా చేయాలంటే దర్శకుడికి వరుస హిట్లు తప్పనిసరి. కనీసం ముందు సినిమా బ్లాక్‌బస్టర్ అయి ఉండాలి. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల దగ్గర అవకాశాలు అందుకోవాలన్నా హిట్ ట్రాక్ రికార్డు అవసరం.
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా భిన్నం. ఒక దర్శకుడిపై నమ్మకం ఉంటే చాలు, అతడి గత ఫలితాలు ఏమై ఉన్నా కూడా కళ్లు మూసుకుని అవకాశం ఇవ్వడంలో పవన్ ఎప్పుడూ ముందుంటారు. దర్శకుల విషయంలో రిస్క్ తీసుకోవడంలో పవన్ ప్రత్యేకత ఇదే.
ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ సుజీత్‌కు ఓజీ లాంటి భారీ అవకాశం దక్కింది. ఓజీకి ముందు సుజీత్ తెరకెక్కించిన సాహో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ హిట్ కాలేదు. అయినా మేకింగ్ పరంగా సుజీత్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాను చూసిన పవన్, అతడి టేకింగ్‌పై నమ్మకంతో ఓజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్. హరీష్ శంకర్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ అనగానే గుర్తొచ్చేది ఒక్క గబ్బర్ సింగ్ మాత్రమే — అదీ పవన్ హీరోగా నటించిన సినిమానే. రెండో సినిమా మిరపకాయ్ బాగానే ఆడింది. ఆ తర్వాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం చిత్రాలు యావరేజ్‌గా నిలిచాయి. ఇటీవలి సినిమాలు మిస్టర్ బచ్చన్, గద్దలకొండ గణేష్ మాత్రం ప్లాప్‌లుగా మారాయి.
ఈ పరిస్థితుల్లో హరీష్ శంకర్‌కు స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం కష్టమయ్యింది. అయినా గత ఫలితాలను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అతడికి ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఇందుకు ఒక కారణం గబ్బర్ సింగ్ కాగా, మరో ప్రధాన కారణం హరీష్ శంకర్ టాలెంట్‌పై పవన్‌కు ఉన్న నమ్మకం.
కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. అదే ధైర్యం వల్లే హరీష్ శంకర్‌కు మరో అవకాశం దక్కిందన్నది కాదనలేని నిజం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత హరీష్ శంకర్‌పై ఉంది. ఈ సినిమా ఫలితంపైనే అతడి భవిష్యత్ కూడా ఆధారపడి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయితే స్టార్ లీగ్‌లో కొనసాగేందుకు, స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడానికి మార్గం ఉంటుంది. లేదంటే… మరో అవకాశం దక్కడం మరింత కష్టమయ్యే పరిస్థితి తప్పదు.
Recent Random Post:















