తను వెడ్స్ మను 3పై అనిశ్చితి

Share


ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ప్రస్తుతం ధనుష్‌తో కలిసి “తేరే ఇష్క్ మే” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో 2013లో వచ్చిన రాంఝనా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ జంట కాంబోలో సినిమా రావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నవంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇకపై ఆనంద్ ఎల్ రాయ్ తన సూపర్‌హిట్ ప్రాంచైజీ “తను వెడ్స్ మను” లో మూడో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైంది. అయితే, రాంఝనా రీ-రిలీజ్ సమయంలో జరిగిన వివాదం ఈ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపింది.

ఈ సంవత్సరం రాంఝనాను ఈరోస్ ఇంటర్నేషనల్ రీ-రిలీజ్ చేసినప్పుడు, ఒరిజినల్‌లో హీరో చనిపోయే క్లైమాక్స్‌ను మార్చి, AI టెక్నాలజీతో హీరోను బతికినట్లు చూపించారు. దీనిపై హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి నుంచి దర్శకుడు, నిర్మాణ సంస్థ మధ్య విభేదాలు తలెత్తాయి.

తను వెడ్స్ మను 3ని వేరే బ్యానర్‌లో చేయాలని ఆనంద్ భావించినా, ఈరోస్ ఇంటర్నేషనల్ తమ వద్దే హక్కులు ఉన్నాయని, బయటి సంస్థలో ప్రాజెక్ట్ చేయరాదని లీగల్ నోటీసులు పంపింది.

ఇప్పటికే తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలు బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. అందువల్ల ఈ ప్రాంచైజీకి మూడో సినిమా వస్తుందని విన్న ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఆనంద్ ఎల్ రాయ్ ఇప్పటివరకు ఈ నోటీసులపై స్పందించకపోవడం గమనార్హం. ఆయన చివరికి ఈ కథను ప్రాంచైజీ నుంచి వేరు చేసి కొత్త సినిమాగా తీస్తారా? లేక ఈరోస్‌తో సయోద్య కుదుర్చుకుని తను వెడ్స్ మను 3ను కొనసాగిస్తారా? అనేది చూడాలి.


Recent Random Post: