
తెలుగు సినీప్రేక్షకుల హృదయాల్లో స్వచ్చమైన, మృదుస్వభావ నటిగా నిలిచిపోయిన లయ, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ చిత్రం ద్వారా ఆమె తిరిగి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఒక్కప్పుడు హీరోయిన్‌గా వెలుగొందిన లయ, వివాహానంతరం అమెరికాలో స్థిరపడటంతో సినిమాలకు దూరమయ్యారు. అనేక అవకాశాలు వచ్చినప్పటికీ, కుటుంబ జీవితాన్ని ప్రాధాన్యమిచ్చారు.
ఇప్పుడు, కాలానుగుణంగా మనసులో మళ్లీ సినిమాల పట్ల ఆసక్తి రేకెత్తడంతో పాటు భర్త ప్రోత్సాహం కూడా లభించడంతో, వెనక్కు తిరిగి చూడకుండా కెమెరా ముందుకు వచ్చేశారు. ‘తమ్ముడు’ చిత్రంలో లయ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఎందుకు అంగీకరించారనే దానిపై లయ స్పందించారు.
“కథ వినగానే ఇది నా రీ ఎంట్రీకి సరైన చిత్రం అనిపించింది. ఇంత బలమైన పాత్రను నేను గతంలో ఎన్నడూ పోషించలేదు. ఆ పాత్ర కోసం పది కిలోల బరువు కూడా పెరిగాను. గత సినిమాలన్నీ ఒక చరిత్ర. ఇప్పుడు అంతా కొత్త ప్రయాణం. పూర్తి కొత్త లయను చూడబోతున్నారు” అని చెప్పారామె.
అలాగే, ఆమె అమెరికాలో ఉన్నప్పుడు సినిమాలు చూడడానికే మానేసిన విషయాన్ని పంచుకున్నారు.
“చూస్తే బాధగా ఉంటుందనే భయంతో సినిమాలవైపు తిరగలేదు. అప్పుడు కొన్ని రోజులు ఐటీ ఉద్యోగం కూడా చేసాను. ‘తమ్ముడు’ దర్శకుడు కథను ఫోన్‌లో ఒక లైన్‌గా చెప్పినప్పుడే ఆసక్తి కలిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తి కథ విని ఒప్పుకున్నాను.”
ఈ సినిమాలో లయ, నితిన్ సోదరిగా ‘ఝాన్సీ కిరణ్మయి’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ,
“నా పాత్రకు ఎలాంటి భయం ఉండదు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ పాత్ర గుర్తుండాలన్నదే నా కోరిక. మంచి పాత్రలకే ప్రాధాన్యమిస్తాను. ‘లయ ఇలా పాత్రలు చేస్తుందా?’ అనే మాట ఎవరి నోటి నుంచైనా రావద్దని నా ఆశ” అని పేర్కొన్నారు.
లయ మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నందుకు తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘తమ్ముడు’ ద్వారా ఆమె మళ్లీ తన మాయాజాలాన్ని పునరావృతం చేస్తారేమో చూడాలి!
Recent Random Post:















