
ఇటీవల తెలుగు సినిమా పాటల కొరియోగ్రఫీపై విమర్శలు పెరుగుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’, ‘డాకు మహారాజ్’, ‘రాబిన్ హుడ్’ చిత్రాల్లోని కొన్ని పాటల కంపోజింగ్ హద్దు మీరిందని, అందులో వల్గారిటీ ఎక్కువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అందమైన పాటలకు శ్రద్ధ తగ్గి, అనవసరమైన స్టెప్పులే హైలైట్ అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
ఈ అంశంపై ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన రాకపోయినా, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. డాన్సుల్లో వల్గారిటీపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని, ఇది కొత్త విషయం కాదని ఆయన గుర్తు చేశారు. “కొన్ని స్టెప్పులు కొంతమందికి నచ్చుతాయి, మరికొంతమందికి నచ్చవు. నచ్చని వారు దాన్ని వివాదంగా మార్చుకుంటారు” అని వర్మ అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా లేకపోయిన రోజుల్లో కూడా ఇలాంటివి జరిగేవని, కానీ ఇప్పుడు అందరికీ తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉండటంతో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయని వర్మ వ్యాఖ్యానించారు. పాటల కంపోజింగ్ విషయంలో నైతికత, అనైతికత అనే విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, “ఎవరి ఇష్టం వారికి ఉంటుంది. నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే వదిలేయొచ్చు” అంటూ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు.
వర్మ వ్యాఖ్యలతో పాటు, గతంలో ఓ స్టార్ డైరెక్టర్ కూడా సినిమాల్లో కాపీ విషయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. “కాపీ అన్నది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు బహిరంగంగా తెలుస్తోంది. కానీ అంతకుముందు తెలియదు” అంటూ ఆ దర్శకుడు చెప్పిన మాటలతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.
ఇకనైనా తెలుగు చిత్ర పరిశ్రమలో పాటల దృశ్యాలను, కొరియోగ్రఫీని ఒక మాదిరి నాణ్యతతో ప్లాన్ చేస్తారా? లేక ఇప్పటి తరహా స్టెప్పులే కొనసాగిస్తారా? అన్నది చూడాలి!
Recent Random Post:














