త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి పారితోషకం ఎంత తెలుసా?

Share


అణుశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, జీవితంలో సాహిత్యంపై ఉన్న మక్కువతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో మ్యాథ్స్ లెక్చరర్‌గా కొంతకాలం పనిచేసిన ఆయన, సినిమా ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యారు. మొదట హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన త్రివిక్రమ్, ఆ సమయంలో కమెడియన్ సునీల్‌తో రూమ్ షేర్ చేసుకున్నారు. అనంతరం పోసాని కృష్ణ మురళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరి దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నారు.

రచయితగా మొదలైన ఆయన ప్రయాణం మాటల రచయితగా మారి సూపర్‌హిట్ డైలాగ్స్‌తో పేరు తెచ్చిపెట్టింది. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం నువ్వే నువ్వే మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా, రెండో సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన అతడు భారీ విజయాన్ని అందించింది. తరువాత జల్సా, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో వంటి చిత్రాలతో తన ముద్రను వేసుకున్నారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంలో స్పెషల్ థ్యాంక్స్ కార్డ్‌లో పేరు కనిపించడంతో ఆయన మళ్లీ చర్చల్లోకి వచ్చారు. అయితే సుజిత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమా విషయంలో త్రివిక్రమ్ జోక్యం చేసుకోకపోవడం కూడా అభిమానుల్లో ఆసక్తి రేపింది.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కెరీర్‌కు సంబంధించిన అరుదైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన మొదటి రెమ్యూనరేషన్ ఎంత అన్న చర్చ ఆసక్తిగా మారింది.

అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో త్రివిక్రమ్‌ను సునీల్, ఎడిటర్ గౌతమ్ రాజుకి పిల్లల ట్యూషన్ మాస్టర్‌గా పరిచయం చేశాడు. అక్కడినుంచి ఆయన డైరెక్టర్ విజయభాస్కర్‌కి పరిచయమై సినిమా ప్రపంచంలో అడుగుపెట్టారు. ప్రారంభ దశలో పేర్లేకుండా పలు సినిమాలకు పని చేసిన త్రివిక్రమ్, ఒక హిట్ చిత్రానికి క్లైమాక్స్ డైలాగ్స్ రాసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు.

ఆ సినిమా కోసం ఆయనకు ఇచ్చిన మొదటి పారితోషకం కేవలం రూ.2000 మాత్రమే. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రతిభను గుర్తించిన విజయభాస్కర్ ఆయనను తనతో కొనసాగిస్తూ పెద్ద అవకాశాలు తీసుకువచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 20 నుండి 25 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాలీవుడ్‌లో అత్యధిక పారితోషక దక్కించుకున్న దర్శకులలో ఒకరిగా నిలిచారు.


Recent Random Post: