దుస్తులే కారణమా? వరలక్ష్మి ఘాటు ప్రశ్నలు

Share


సమాజంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు వారు వేసుకునే దుస్తులే కారణమని వినిపిస్తున్న వాదనపై నటి వరలక్ష్మి శరత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మహిళల దుస్తులను కారణంగా చూపిస్తూ తప్పులను సమర్థించే మగవారి ఆలోచనా విధానాన్ని ఘాటుగా తప్పుబట్టారు. “బట్టలు మార్చుకోవడం వల్ల సమాజం మారదు.. చూసే కళ్లలో మార్పు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన రక్షణ ఉంటుంది” అని కుండబద్దలు కొట్టారు.

దుస్తుల సాకుతో వేధింపులను సమర్థించే వారికి వరలక్ష్మి సూటిగా ప్రశ్న వేశారు. “మీ ఇంట్లో మీ అక్క లేదా చెల్లి షార్ట్స్ వేసుకున్నప్పుడు వారిని చూసి మీకు చెడు ఆలోచనలు వస్తాయా?” అని నిలదీశారు. ఇంట్లోని మహిళలను చూసినప్పుడు రాని ఆలోచనలు బయట మహిళలను చూసినప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. ఇది కేవలం దుస్తుల సమస్య కాదని.. వ్యక్తిత్వ లోపమని ఆమె స్పష్టం చేశారు.

ముఖ్యంగా మహిళల లోదుస్తుల విషయంలో సమాజంలో ఉన్న ద్వంద్వ వైఖరిని వరలక్ష్మి ఎండగట్టారు. ఒక అమ్మాయి బ్రా స్ట్రాప్ పొరపాటున బయటకు కనిపిస్తే ప్రపంచమే అంతమైపోయినట్టు ఎందుకు చూడాలని ప్రశ్నించారు. బ్రా అనేది కేవలం ఒక ఇన్నర్‌వేర్ మాత్రమేనని, అది ప్రతి మహిళకు సాధారణ అవసరమని గుర్తు చేశారు. అదే సమయంలో పురుషుల ఉదాహరణను తీసుకువచ్చారు. “మగవారు జీన్స్ వేసుకుని వంగితే వారి లోదుస్తులు కనిపిస్తాయి. కానీ దాన్ని చూసి ఏ అమ్మాయి కూడా వారిపై అఘాయిత్యానికి పాల్పడదు కదా? మరి మహిళల విషయంలోనే ఎందుకు ఇంత వివక్ష?” అని ప్రశ్నించారు.

ఎవరి శరీరం వారిదే.. తమకు నచ్చిన దుస్తులు వేసుకునే పూర్తి స్వేచ్ఛ ప్రతి మహిళకు ఉందని వరలక్ష్మి స్పష్టం చేశారు. ఒకరి డ్రెస్సింగ్‌ను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ఎవరికీ హక్కు లేదని హెచ్చరించారు. అందాన్ని మెచ్చుకోవడం తప్పు కాదని.. కానీ ఆ మెప్పు గౌరవప్రదంగా ఉండాలని, ప్రవర్తనలో హద్దులు దాటకూడదని సూచించారు.

తనలోని ఈ నిర్మొహమాట స్వభావం కేవలం తనను తాను రక్షించుకోవడానికే కాకుండా, తోటి మహిళల్లో ధైర్యాన్ని నింపడానికేనని వరలక్ష్మి పేర్కొన్నారు. వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా గళం ఎత్తాలని, సెలబ్రిటీగా తన వాయిస్ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తానని పిలుపునిచ్చారు.

ఇటీవల ఆమె దర్శకత్వం వహించిన సరస్వతి చిత్రం కూడా విడుదలై చర్చనీయాంశమైంది. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తూ వరలక్ష్మి మరోసారి వార్తల్లో నిలిచారు.


Recent Random Post: