
దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సంచలనం సృష్టించిన చిత్రం దృశ్యం అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, సింహళ, చైనీస్ భాషల్లో రీమేక్ అయ్యి ప్రతిచోటా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
దీనికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 కూడా అదే స్థాయిలో విజయం సాధించింది. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో వి. రవిచంద్రన్ నటించిన ఈ సీక్వెల్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సహజంగానే **దృశ్యం 3**పై పడింది. ఇప్పటికే మలయాళంలో మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కలిసి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, వచ్చే ఏడాది తొలి అర్థభాగంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే, మలయాళ వెర్షన్ విడుదలకు ముందే హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం 3 పనులను ప్రారంభించడం విశేషం. రైట్స్ సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆయన మలయాళ కథకు సంబంధం లేకుండా, కొత్త కథతో థర్డ్ పార్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. మలయాళ వెర్షన్ రిలీజ్ సమయానికే హిందీ వెర్షన్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అజయ్ దేవగన్ ప్లాన్ చేస్తున్నాడట.
మలయాళ, హిందీ వెర్షన్‌లకు సంబంధించిన హడావుడి ఈ స్థాయిలో కొనసాగుతుంటే, తెలుగులో మాత్రం దృశ్యం 3 రీమేక్‌పై ఎలాంటి కదలిక కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు భాగాల్లో కీలక పాత్ర పోషించిన వెంకటేష్ ఇప్పటివరకు థర్డ్ పార్ట్ గురించి మౌనం పాటించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం వెంకీ మామ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో గెస్ట్ రోల్ పూర్తి చేసిన ఆయన, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శకుటుంబం హౌస్ నంబర్ 47 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుండగా, ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనే ప్లాన్‌లో వెంకటేష్ ఉన్నారని తెలుస్తోంది.
ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో వెంకటేష్ దృశ్యం 3 రీమేక్‌కు సమయం కేటాయిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వెంకీ రెడీ అయినా, దర్శకుడు జీతూ జోసెఫ్ మాత్రం మలయాళ వెర్షన్ పనులు పూర్తయ్యే వరకు తెలుగు వెర్షన్‌పై దృష్టి పెట్టే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. దీంతో మలయాళ, హిందీ వెర్షన్‌లతో పోలిస్తే తెలుగు దృశ్యం 3 మరింత ఆలస్యంగా వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Recent Random Post:














