తాను నటుడిని కాకపోయి ఉంటే, పాతాళంలోకి పడిపోయేవాడినని, అండర్ వరల్డ్‌లో ఉండేవాడిని అని అన్నారు ప్రముఖ నటుడు నానా పటేకర్. నేను చాలా హింసాత్మక వ్యక్తిని. ఎక్కువగా మాట్లాడను. నేను చేసే పనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. నేను ఇప్పుడు తక్కువ హింసాత్మకంగా ఉన్నాను. కానీ ఈ రోజు కూడా ఎవరైనా నన్ను టార్గెట్ చేస్తే వారిని కొట్టేస్తాను! అని అన్నారు. నేను నటుడిని కాకపోతే పాతాళంలో ఉండేవాడిని.. దీని గురించి చాలా సీరియస్‌గా ఉన్నాను.. అని తనలోని వైల్డ్ యాంగిల్ గురించి ఏమాత్రం దాచుకోకుండా బహిర్గతం చేసారు. గతంలో తాను చాలా గొడవల్లో ఉన్నానని నానా అంగీకరించాడు.
సిద్దార్థ్ కన్నన్ తో చాటింగ్ సెషన్ లో నానా పటేకర్ ఇలాంటి కఠినమైన నిజాల్ని బయటపెట్టారు. ఇటీవల వనవాస్ సెట్స్‌లో అభిమానిని చెంపదెబ్బ కొట్టడం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఒకరిని చెంప దెబ్బ కొట్టడం తప్పేనని కూడా నానా ఒప్పుకున్నారు. అయితే ఎవరిపైన అయినా తమ ప్రేమను వ్యక్తపరిచే సమయం సందర్భం, చోటు సరైనవా కాదా? అన్నది అభిమానులు లేదా ప్రజలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నానా పేర్కొన్నాడు.
తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన నానా పటేకర్ అతడు ఆ సమయంలో అలా చేయకూడదని అభిప్రాయపడ్డారు.
వారణాసిలో నానా షూటింగ్ లో పాల్గొంటున్న క్రమంలోనే ఆ వ్యక్తి వచ్చాడు. సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. వెంటనే నానా చాచి కొట్టారు. అది కెమెరాలో రికార్డయిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో నానా ఆ అభిమానికి క్షమాపణలు చెప్పాడు. ”మేము షాట్ చిత్రీకరణలో ఉన్నామని అతడికి తెలియదు. షాట్స్ మధ్యలోకి వచ్చి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. నేను అతనిని చెంపదెబ్బ కొట్టాను.. అది తప్పు” అని కూడా నానా పటేకర్ అన్నారు.
కానీ ఒక వ్యక్తి పట్ల మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఒక చోటు ఉంటుంది. నేను షాట్ పూర్తి చేసిన తర్వాత అతడు వచ్చి ఉంటే నాకు సమస్య ఉండదు. అయితే అది పెద్ద వివాదంగా మారింది! అని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో నానా పటేకర్ కామోషి సెట్లో సంజయ్ లీలా భన్సాలీతో గొడవ పడిన విషయాన్ని కూడా ప్రస్థావించారు. తాను చాలా మంది నటులు, దర్శకులను కూడా కొట్టానని నానా అంగీకరించారు. నానా పటేకర్ నటించిన ‘వనవాస్’ డిసెంబర్ 20న విడుదల కానుంది. అనీల్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రుతి మరాతే, అశ్విని కాళేష్కర్ తదితరులు నటించారు.
Recent Random Post: