
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు ఆయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ శుక్రవారం కన్నుమూశారు. 83 ఏళ్ల దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా, ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1960-70 దశకాల్లో దేబ్ ముఖర్జీ పలు హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరుగనున్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అంతిమ సంస్కారాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించగా, సోషల్ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
దేబ్ ముఖర్జీ ‘ఏక్ బార్ మూస్కురా దో’ (1972), ‘జో జీతా వోహీ సికందర్’ (1992), ‘లాల్ పత్తర్’ (1971) వంటి చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందారు. సినీ రంగంతో పాటు ముంబై సాంస్కృతిక ప్రపంచంలో కూడా గణనీయమైన పాత్ర పోషించారు. ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండాల్ నిర్వాహకులలో ఆయన ఒకరు.
దేబ్ ముఖర్జీ కుమారుడు ఆయాన్ ముఖర్జీ ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరిగా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం ఆయాన్ హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘వార్ 2’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తండ్రి మృతితో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సమాచారం.
Recent Random Post:















