
రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌తో నయనతార తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. మొదట్లో ఓ సాధారణ గ్లామర్ హీరోయిన్గా కనిపించిన ఈ మలయాళ భామ, కాలక్రమేణా తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో నటిగా గొప్ప పేరు తెచ్చుకున్న నయన్, “లేడీ సూపర్ స్టార్” అనే ఇమేజ్ను సొంతం చేసుకుని తన లెవెల్ వేరు అని మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం ఒకవైపు మహిళా ప్రధాన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే, మరోవైపు టాప్ స్టార్ల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది.
తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిరంజీవి సినిమా **‘మన శంకర వరప్రసాద్ గారు’**లో నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చిరుకు దీటైన పాత్రలో తనదైన నటనతో మరోసారి మెప్పించింది. అయితే ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర పూర్తిగా కొత్తదేమీ కాదు. ఇలాంటి పాత్రలకు నయన్‌కు మంచి అనుభవమే ఉంది.
పెళ్లయ్యాక భర్తతో విభేదాలు రావడం, విడిపోవడం, పిల్లల్ని భర్తకు దూరంగా ఉంచడం, తన కాళ్ల మీద తాను నిలబడడం… చివరికి భర్తను అర్థం చేసుకుని మళ్లీ అతనితో కలిసిపోవడం – ఇదే **‘మన శంకర వరప్రసాద్ గారు’**లో నయనతార పాత్ర తీరు. ఇదే తరహా క్యారెక్టర్‌ను ఆమె అజిత్ నటించిన **‘విశ్వాసం’**లోనూ చేసింది. అంతకుముందు వెంకటేష్ చిత్రం **‘తులసి’**లోనూ ఇలాంటి పాత్రతో కనిపించింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమ్ తెగ వైరల్ అవుతోంది. “భర్త నుంచి విడిపోయి, పిల్లల్ని కలవనివ్వని క్యారెక్టర్” అని దర్శకుడు చెబితే… “ఈ సినిమా మనమే చేస్తున్నాం” అని నయన్ వెంటనే ఓకే చెబుతుందన్నట్లుగా ఈ మీమ్‌ను క్రియేట్ చేశారు. భలే ఫన్నీగా ఉన్న ఈ మీమ్ నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాగా కనెక్ట్ అయిన నయనతార, ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం కోసం ప్రమోషనల్ వీడియోల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సినిమా మాత్రమే కాదు, నయన్ పాత్ర కూడా ప్రేక్షకుల్లో మరింతగా గుర్తుండిపోయేలా మారింది.
Recent Random Post:















