నాగార్జునపై లోకేష్ కనకరాజ్ అభిమానం – కూలీలో పాత్రకు వెనుకకథ!

Share


తమిళ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు, మన టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునపై ఉన్న అభిమానం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దర్శకులు తమ భాషకు చెందిన హీరోలను అభిమానిస్తారు. కానీ, తమిళంలో అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగిన లోకేష్‌కి మాత్రం నాగ్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది.

తన చిన్ననాటి నుండి నాగార్జున సినిమాల ఫ్యాన్‌గా ఉన్నానని చెప్పిన లోకేష్, “రక్షకుడు (రక్షగన్) సినిమా నాకు ఆల్ టైం ఫేవరెట్. స్కూల్ డేస్‌లో ఆ సినిమా చూసి ఎంతో ప్రభావితుడినయ్యాను. నాగ్ లుక్, స్టైల్, యాటిట్యూడ్ అన్నీ నన్ను ఇన్‌స్పైర్ చేశాయి. కాలేజీ వరకూ అదే హెయిర్‌స్టైల్ మెయింటేన్ చేశాను” అని చెప్పాడు.

నాగ్ చేసిన శివ, గీతాంజలి, అన్నమయ్య సినిమాలపై కూడా లోకేష్ ప్రస్తావిస్తూ, “ఆయన నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు నేను అభిమానిగా మారాను. ఆయన స్టైల్ నాకు బాగా నచ్చుతుంది” అని వెల్లడించాడు.

ఇక త్వరలో విడుదల కానున్న ‘కూలీ’ సినిమా కోసం నాగార్జునను ఒప్పించడంలో తనకు ఎంత కష్టం వచ్చిందో కూడా లోకేష్ షేర్ చేసుకున్నాడు. “ఆయన మొదట నో చెప్పారు. కానీ నేను ఆరేడుసార్లు వెళ్ళి, నా విజన్, క్యారెక్టర్ డెఫినిషన్ చెబుతూ ఎలాగోలా ఒప్పించాను. ‘ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేద్దాం’ అన్న మాటతో ఆయన అంగీకరించారు” అని వివరించాడు.

తన అభిమాన హీరోను ఒక పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో చూపించడానికి చేసిన ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి! ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుంది.


Recent Random Post: