నాగార్జున కెరీర్‌లో కీలక మలుపులు – అభిమానుల మిశ్ర స్పందన

Share


ఇటీవల కింగ్ నాగార్జున కుబేర సినిమా ద్వారా టాలీవుడ్‌లో కొత్త ప్రయాణాన్ని ఆరంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈడీ అధికారి దీపక్ పాత్రలో ఆయన కనిపించారు. ఆ పాత్రకు రెండు వైపులున్నాయి – పాజిటివ్, నెగటివ్. చివరికి దీపక్ పాత్రను పాజిటివ్‌గా ముగించినప్పటికీ, క్లైమాక్స్‌లో ఆ పాత్ర చనిపోవడం అభిమానుల్లో కొంత అసంతృప్తిని కలిగించింది. అంతేకాదు సినిమాలో నాగార్జున కీలక పాత్రకే పరిమితమవ్వడం ఒక వర్గం ప్రేక్షకులను సంతృప్తి పరచలేదు.

సాధారణంగా స్టార్ హీరో ఒకరిది అయిన సినిమాలో నాగ్ లాంటి అగ్ర నటుడు కీలక పాత్ర చేస్తే అలాంటి ఫీల్ సహజమే. నటుడిగా తనకు నచ్చిన పాత్ర చేసినా, హీరో కాదనే భావన అభిమానుల్లో తగిలింది. అయితే కుబేర బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించడం ఆ అసంతృప్తిని కొంతవరకు తగ్గించింది. నాగ్ కెరీర్‌లో ఆ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన తొలి చిత్రం కావడంతో అది అభిమానులకు ఒక ఊరటగా మారింది.

తర్వాత ఆయన పాన్-ఇండియా చిత్రం కూలీలో నేరుగా విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. సైమన్ పాత్రలో రాజనీకాంత్, ఆమిర్ ఖాన్, ఉపేంద్రలతో కలిసి స్క్రీన్ షేర్ చేశారు. ఈసారి నాగార్జున విలన్‌గా వస్తున్నాడని ముందే క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఆ పాత్రపై మంచి హైప్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ కూడా ఆ రోల్ తానే చేయాలని అనుకోవడం వల్ల ఆ పాత్ర ప్రాధాన్యం మరింత పెరిగింది.

కానీ కూలీ ఫలితం అంచనాలకు తగ్గట్లుగా రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. సినిమా హిట్ అయితే నాగార్జున సైమన్ పాత్రను కొనసాగించే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో టాక్ వచ్చింది. కానీ ప్రతికూల ఫలితంతో ఆ అవకాశమే తగ్గిపోయింది. ఇకపై ఇలాంటి పాత్రలతో నాగార్జున కెరీర్ ఏ దిశగా సాగుతుందో చూడాలి.


Recent Random Post: