నాన్నతో గొడవలే.. తల్లి ధైర్యమే బలం: నవీన్ పొలిశెట్టి

Share


చాలామంది డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యానంటారు. మరికొందరు యాక్టర్ అవుతానని అసలు ఊహించలేదని, యాదృచ్ఛికంగా ఇండస్ట్రీలోకి వచ్చానని చెబుతుంటారు. కానీ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మాత్రం చిన్ననాటి నుంచే తాను నటుడవ్వాలనే లక్ష్యంతోనే ముందుకెళ్లాడట. ఈ లక్ష్యం కోసం తన తండ్రితో ఎన్నో సార్లు గొడవలు కూడా పడ్డానని తాజాగా వెల్లడించాడు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆ విభేదాలు మరింత పెరిగాయని, కానీ తల్లి ఇచ్చిన ధైర్యమే తనను చివరకు నటుడిగా నిలబెట్టిందని నవీన్ చెప్పుకొచ్చాడు.

నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న భారీ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఇక రాజు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా పూర్తి స్థాయిలో నవీన్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. కింగ్ నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు మరింత ప్లస్‌గా నిలుస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన నవీన్ తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘వన్ నేనొక్కడినే’ వంటి సినిమాల్లో పేరులేని చిన్న పాత్రలు చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. సరైన అవకాశం కోసం ఏడు సంవత్సరాలు ఎదురుచూసిన తర్వాత ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా బ్రేక్ వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమా తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందన్నాడు.

అయితే ఈ స్థాయికి చేరుకోవడం అంత ఈజీ కాదని నవీన్ భావోద్వేగంగా చెప్పాడు. ముంబైలో ఉన్న రోజుల్లో పాకెట్ మనీ కోసం పెళ్లిళ్లలో సహాయకుడిగా పని చేశానని, అనేక ఆడిషన్లలో అవమానాలు ఎదుర్కొన్నానని వెల్లడించాడు. “టాలెంట్ ఉంది కానీ స్కిన్ కలర్ బాగోలేదన్నారు, ఇంకొకచోట సిక్స్ ప్యాక్ లేదన్నారు, మరో ఆడిషన్‌లో హైట్ సరిపోదని పక్కన పెట్టారు. అప్పుడు రోడ్డుపై నడుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి” అని చెప్పుకొచ్చాడు. సినిమా ఒక్కటే తన ప్రపంచంగా మారడంతో ఎంతోమంది ఆత్మీయులకు దూరమయ్యానన్నాడు.

ఇప్పుడిప్పుడే హీరోగా స్థిరపడుతున్నప్పటికీ, నవీన్‌కు ఇంకా కొన్ని కలలు మిగిలే ఉన్నాయట. పాన్ ఇండియా దర్శకులు రాజమౌళి, రాజు హిరానీ, జోయా అక్తర్‌లతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నానని చెప్పాడు. అయితే ఆ కలలు ఎప్పుడు నెరవేరుతాయో చెప్పలేనని, వాటికోసం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని స్పష్టంచేశాడు. రెండు మూడు బ్లాక్‌బస్టర్లు వచ్చినా కూడా ఆ దర్శకులతో సినిమా చేయడం గ్యారెంటీ కాదని, అందుకే ఇప్పటికైతే ఆ డ్రీమ్స్ డ్రీమ్స్‌గానే ఉండిపోయే అవకాశముందని సినీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.


Recent Random Post: