
చూస్తున్నారు కదా ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్… ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదు అనిపించేలా ఉంది. దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు నాలుగు మూలస్థంబాల్లా నిలిచిన స్టార్ హీరోలు — చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ — ఒకే ఫ్రేమ్‌లో రోడ్‌సైడ్ కాకా హోటల్‌లో టీ తాగుతూ కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఫోటో చూస్తూనే, “ఇది హనుమాన్ జంక్షన్‌లోని ప్రసిద్ధ కాకా హోటలా? బెజవాడ బెంజ్ సర్కిల్? లేక కత్తిపూడి జంక్షనా?” అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ వల్ల సమస్యలు పెరుగుతున్నా, ఒకవైపు ఇది అభిమానుల్లో క్రియేటివిటీని కూడా పెంచుతోంది. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ధనుష్, అజిత్ రోడ్డుపక్కన టీ తాగుతున్నట్లు కనిపించిన ఫోటో కూడా ఇదే రేంజ్‌లో వైరల్ అయింది. అసలు చూస్తుంటే అది నిజంగానే ఉన్నట్టుండగా, చివరికి అవి కూడా ఏఐలో రూపొందించినవేనని తేలింది.
ఇప్పుడు అదే తరహాలో, చిరు–బాలయ్య–నాగ్–వెంకీలతో పాటు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కాకా హోటల్‌లో టీ, కాఫీలు తాగుతున్నట్టు కనిపించే ఏఐ ఫోటోలు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి. ఇది కొత్త తరానికి ఒక ట్రెండ్‌గా మారింది. ఒకరి పోస్టు చూస్తే వెంటనే మరొకరు తమ ఊహాశక్తిని ఏఐలో ప్రదర్శిస్తూ స్టార్లను ఆశ్చర్యపరుస్తున్నారు.
★ ఏఐతో కథానాయికలకు పెరుగుతున్న ముప్పు
అయితే ఈ టెక్నాలజీ వల్ల పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నది యువ నటీమణులే. వారి ఫోటోలను ఏఐతో మోర్ఫ్ చేసి, లేనిది ఉన్నట్టు అసభ్యంగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీ నష్టం కలిగిస్తున్నారు. ఇది క్షమించరాని నేరం కావడంతో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు కూడా వేగంగా పెరుగుతున్నాయి.
ఇంతకుముందు రష్మిక మందన్న ఏఐ వల్గర్ చిత్రాలు బయటకు రావడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, కీర్తి సురేష్, అనన్య పాండే వంటి అనేకమంది యువ నటీమణులు కూడా ఏఐ దుర్వినియోగానికి బలయ్యారు.
ఏఐ ద్వారా వారి శరీరాకృతిని మార్చి మరింత బోల్డ్‌గా చూపించే ఫేక్ విజువల్స్‌ను సృష్టించడం సామాజికంగా తీవ్రమైన ప్రమాదంగా మారింది. ఇది కేవలం సెలెబ్రిటీలకే పరిమితం కాకుండా, సాధారణ మహిళల ఫోటోలను కూడా విద్యార్థులు, యువకులు దుర్వినియోగం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.
★ ప్రముఖులు కోర్టులను ఆశ్రయిస్తున్న పరిస్థితి
ఈ నేపథ్యంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, నాగార్జున, చిరంజీవి వంటి పలువురు ప్రముఖులు కోర్టులను ఆశ్రయించి, తమ ఫోటోలు, వీడియోలు, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత కంటెంట్‌ను అనుమతి లేకుండా ఏఐతో మార్చకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టులు కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నాయి.
Recent Random Post:














