
భారత ప్రభుత్వం పరీక్షల సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు తీసుకున్న ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది. పరీక్షల్లో విఫలమై ఆత్మహత్యలకు పాల్పడేవారు, న్యూనత భావంతో బాధపడేవారు, తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు అనేక మంది ఉన్నారు. పరీక్షలే జీవితంలో ప్రతిదానికన్నా ముఖ్యమని భావించి బాధను అనుభవిస్తున్న విద్యార్థులకు సరైన మార్గదర్శనం అవసరమని ప్రభుత్వం గుర్తించింది.
ఈ లక్ష్యంతో చేపట్టిన “పరీక్ష పే చర్చ” కార్యక్రమం విద్యార్థులకు మానసికంగా మద్దతుగా నిలుస్తోంది. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొని పరీక్షల ఒత్తిడి, ఆందోళనలను అధిగమించే మార్గాలపై చర్చించారు. బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణే తన స్వీయ అనుభవాలను పంచుకుంటూ, తన చిన్నతనంలో ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి వివరించారు. విద్యార్థులతో మాట్లాడుతూ, పరీక్షల ఒత్తిడి తన జీవితానికెలా ప్రభావం చూపిందో చెప్పిన దీపిక, ఒక సమయంలో తీవ్ర నిరాశకు గురైన విషయాన్ని గుర్తు చేసుకుంది. తొలుత సమస్యను అర్థం చేసుకోలేకపోయానని, కాలక్రమంలో తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనయ్యానని, డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది. ఆత్మహత్య గురించి తాను ఆలోచించిన సందర్భాలను కూడా ఓపెన్‌గా చెప్పింది.
అయితే దీపిక వ్యక్తిగత అనుభవాలను విద్యార్థులతో పంచుకోవడం సరికాదని, మరింత ఆందోళన పెంచుతుందన్న విమర్శలు వచ్చాయి. విద్యార్థుల ముందు ఇలాంటి విషయాలను ప్రస్తావించడం అవసరమా అని కొందరు ప్రశ్నించారు. అంతేకాదు, దీపిక స్థానంలో మానసిక నిపుణులను ఆహ్వానించాల్సిందని సూచనలు వచ్చాయి. మరికొందరు దీపికను ప్రధాని మోదీ ఆహ్వానించడాన్ని రాజకీయం చేయడం తప్పని విమర్శించారు.
అయితే, సెలబ్రిటీల ద్వారా మానసిక ఆరోగ్యం గురించి చర్చ ముందుకు వెళ్లడం మంచిదని భావించే వారు కూడా ఉన్నారు. విద్యార్థులు ప్రేరణ పొందేందుకు ఈ అనుభవాలు ఉపయోగపడతాయని, అవగాహన పెరుగుతుందని అంటున్నారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలను అనవసరంగా రాజకీయం చేయకుండా, విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం కల్పించడమే ముఖ్యమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Recent Random Post:














