
2014లో విడుదలైన ‘పీకే’ భారతీయ సినీ చరిత్రలోనే అద్భుతమైన బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా అప్పట్లోనే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ‘3 ఇడియట్స్’ ద్వారా సంచలన విజయం అందుకున్న ఆమిర్ ఖాన్ – రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్, ‘పీకే’తో కొత్త రికార్డులను సృష్టించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఈ సినిమా విషయంలో ఆమిర్ ఖాన్, హిరాని ఇద్దరికీ పూర్తి సంతృప్తి కలగలేదట.
ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆమిర్ ఖాన్, అసలు కథకు, ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెర్షన్‌కు తేడా ఉందని చెప్పారు. “రాజ్‌కుమార్ హిరాని మొదట రాసుకున్న కథ వేరేలా ఉండేది. కానీ షూటింగ్ సమయంలో అనుకోని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో పెద్ద మార్పు జరిగింది. అప్పట్లో విడుదలైన మరో సినిమా ముగింపుతో కొంత పోలిక ఉంటుందనే కారణంగా, హిరాని పూర్తిగా కొత్త క్లైమాక్స్ రాశారు. అయితే, ముందుగా రాసిన కథనే తీసి ఉంటే సినిమా మరింత గొప్పగా ఉండేదని భావిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఇటీవల హిరాని కూడా ‘పీకే’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌లో అనుకున్నదానికంటే ఎక్కువగా ఆడిన చిత్రం ‘పీకే’ అని తెలిపారు. అదే సమయంలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన సినిమా ‘డంకీ’ అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరాని – సంజయ్ దత్ కాంబినేషన్‌లో ‘మున్నాభాయ్ 3’ ప్లాన్ అవుతోంది. మరోవైపు, ఆమిర్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలో వీరిద్దరూ కలిసి మరో సినిమాకు ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు.
Recent Random Post:














