
జాతీయ చలనచిత్ర పురస్కారాల జ్యూరీ విధివిధానాలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల జ్యూరీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన, ఆ అనుభవంపై మాట్లాడుతూ కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
జ్యూరీ సభ్యుల ఎంపికలో కేరళ ప్రభుత్వం పూర్తిస్థాయి స్వేచ్ఛను కల్పించిందని, “అవార్డుల్లో మేము జోక్యం చేసుకోమని ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చింది” అని ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే, జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో ఇలాంటి పారదర్శకత కనిపించదని ఆయన వ్యాఖ్యానించారు. “అక్కడ ఫైళ్ల కుప్పలు ఉంటాయి, రాజకీయ మరియు పరిపాలనా జోక్యం ఎక్కువగా ఉంటుంది” అని విమర్శించారు.
ఇంతేకాక, ప్రస్తుత భాజపా-ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నంత వరకు మమ్ముట్టి వంటి గొప్ప నటుడికి జాతీయ అవార్డు లభించే అవకాశం తక్కువ అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన జరిగిన జ్యూరీ సమావేశంలో, మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ చిత్రంలో ఆయన అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డు దక్కింది.
జ్యూరీ సభ్యుల ఎంపికలో బయటి వ్యక్తి అవసరమని, తమ పనిలో రాజకీయ జోక్యం ఉండదని కేరళ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.
55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో, మమ్ముట్టి “భ్రమయుగం” కోసం ఉత్తమ నటుడిగా, షమ్లా హంజా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇప్పటికే మమ్ముట్టి మూడుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇది ఆయనకు ఏడవ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కావడం విశేషం.
మమ్ముట్టి నటనపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రకాష్ రాజ్, “ప్రతి సన్నివేశంలో డీటెయిలింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన నటన చూసి నాకు కూడా అసూయ కలిగింది. నేటితరం హీరోలు ఆయననుంచి చాలా నేర్చుకోవాలి” అన్నారు. “మమ్ముట్టి యువ హీరోలతో పోటీగా నటించి మెప్పిస్తున్నారు. యువత ఇంకా ఆ స్థాయి ఎక్స్‌ప్రెషన్స్ సాధించాలి” అని సూచించారు.
2024-25 సీజన్‌కు సంబంధించిన కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రానికి ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. ఈ సినిమాకు దర్శకుడైన చిదంబరం ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును కూడా ఈ చిత్రమే దక్కించుకుంది.
నస్లెన్ – మమితా బైజు నటించిన ‘ప్రేమలు’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది. ప్రకాష్ రాజ్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ సమక్షంలో సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు.
Recent Random Post:















