
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుండటంతో, రామ్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, యాంకర్ అడిగిన ప్రశ్నకు రామ్ ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ మనసులను తాకేలా ఉంది.
యాంకర్ అడిగిన ప్రశ్న – “తెలుగు ప్రేక్షకుల ప్రేమ పిచ్చి స్థాయిలో ఉంటుంది. టీజర్లో మీరు రామ్లా కాకుండా, ఒక ఫ్యాన్‌లా కనిపించారు. ఆ పాత్రలోకి వెళ్లడానికి ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసారా?” అని. దానికి రామ్ ఇచ్చిన సమాధానం హృదయాన్ని తాకేలా ఉంది.
“ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి – కథ విన్నాక ఆ క్యారెక్టర్ కోసం హోంవర్క్ చేయడం. రెండోది – మన మనసులో ఎప్పటినుంచో నడుస్తున్న ఒక ఆలోచనకు సమాధానం ఇచ్చేలా ఒక కథ దొరకడం. ఈ సినిమా రెండో రకం” అని రామ్ చెప్పాడు.
ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ రామ్ అన్నాడు – “ఒక స్టార్‌కి, ఫ్యాన్‌కి మధ్య ఉండే బాండ్ అనేది బయటివాళ్లకు ఎప్పటికీ అర్థం కాదు. వాళ్లను ఎప్పుడూ కలవకపోయినా, ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. నాకు ఎప్పుడూ ఈ ప్రశ్న ఉండేది – వాళ్లతో మన సంబంధం ఏమిటి? మనం వాళ్ల కోసం ఏం చేశాం? ఈ సినిమానే ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుందని నమ్ముతున్నాను. ఆ భావోద్వేగాన్ని, ఆ బంధాన్ని ఈ సినిమా అందంగా చూపిస్తుంది” అని వివరించాడు.
అంతేకాకుండా, ఇప్పటివరకు వచ్చిన ఫ్యాన్-బేస్డ్ సినిమాలు ఆ ఎమోషన్‌ను సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదని రామ్ పేర్కొన్నాడు. “ఎక్కడో ఫ్యాన్‌ను విలన్‌గా లేదా కామెడీ కోణంలో చూపించారు. కానీ స్టార్‌కి, ఫ్యాన్‌కి మధ్య ఉండే ప్యూర్ రిలేషన్షిప్ గురించి ఎవరూ నిజంగా చెప్పలేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన సంబంధం, కానీ చాలామందికి అది అర్థం కాదు” అని అన్నాడు.
తన ఆలోచనను కొనసాగిస్తూ రామ్ చెప్పాడు – “ఆ ప్రేమ ‘అన్‌కండిషనల్’. ఆ హీరోకు తెలియకపోయినా, అతనికోసం ఫ్యాన్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అతనికీ ఫ్యాన్ ఉన్నాడన్న విషయం తెలియకపోయినా, ఆ ప్రేమ మాత్రం నిలుస్తుంది. ఇంత అందమైన భావనను ఎవరూ ఇంతవరకు ఎందుకు చూపించలేదా అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ కథ విన్న వెంటనే ‘ఇదే మనం చెప్పాలనుకున్నది’ అని అనిపించింది” అని రామ్ ముగించాడు.
Recent Random Post:














