
ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్‌మ్యాన్ గా దూసుకుపోయిన హీరోల్లో రాజశేఖర్ ఒకరు. అంకుశం, అల్లరి మగాడు, ప్రియుడు వంటి చిత్రాలతో 90లలో దుమ్ము దులిపిన రాజశేఖర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే కాలక్రమేణా హిట్స్ తగ్గడంతో, మరెన్నో సీనియర్ హీరోల్లాగే ఆయన కెరీర్ కూడా క్షీణించింది. ఒక దశలో కొత్త సినిమాలు లేక పూర్తిగా కనిపించకుండా పోయారు.
తరువాత గరుడ వేగ సినిమాతో మరోసారి పుంజుకునే ప్రయత్నం చేశారు. ఆ సినిమా మంచి పేరు తెచ్చినా, ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టులు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రెండు ఏళ్ల క్రితం రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రవేశించి నితిన్ నటించిన ఎక్స్ట్రార్డినరీ మాన్ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేశారు. కానీ ఆ సినిమా ప్లాప్ కావడంతో ఆ ప్రయోగం పెద్దగా గమనించబడలేదు.
ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న బైకర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ సందర్భంగా రాజశేఖర్ వ్యక్తిగతంగా ఒక విషయం వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు.
తాను చాలా ఏళ్లుగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని చెప్పారు. దీని వల్ల కడుపు నొప్పి, జీర్ణ సమస్యలతోపాటు మెదడు, కండరాలపై కూడా ప్రభావం ఉంటుందని తెలిపారు. టీజర్ ఈవెంట్లో మాట్లాడాలన్నప్పుడు కూడా ఇదే కారణంగా ఆందోళనకు గురయ్యానని చెప్పారు. ఖాళీగా ఉండడం తనకు ఒప్పుకాదని, పని లేకుంటే గోడమీద ఉన్నట్టుగా అనిపిస్తుందని వెల్లడించారు.
బైకర్ షూటింగ్ సమయంలో విదేశాల్లో ఒక ఫోటోగ్రాఫర్ తనకున్న సినిమా కమిట్మెంట్స్ గురించి తెలుసుకొని, ఈ వయసులోనూ పని చేయడం మీ అదృష్టమని చెప్పాడని, అది తర్వాత ఆలోచించినప్పుడు నిజంగానే జీవితం ముందు పెట్టిన అవకాశాన్ని అర్ధం చేసుకున్నానని రాజశేఖర్ అన్నారు.
కరోనా సమయంలో మూడు నెలల పాటు మంచం పట్టిపోయి కాలి మీద నిలబడలేని స్థితికి చేరానని, కోలుకున్న తర్వాత చాలాసినిమా కథలు విన్నా నచ్చలేదని చెప్పారు. అయితే బైకర్ స్క్రిప్ట్ తన హృదయానికి నచ్చడంతో ఆ పాత్రను ఎంతో ఇష్టపూర్వకంగా చేశానని ఆయన అన్నారు.
Recent Random Post:














