మాస్ రాజా కొత్త ప్రయోగం – క్లాస్ టచ్‌లో రవితేజ నెక్ట్స్!

Share


రవితేజకు “మాస్ రాజా” అనే పేరు యాదృచ్ఛికంగా రాలేదు. అతని కెరీర్‌లో ఎక్కువ విజయం మాస్ చిత్రాల ద్వారానే వచ్చాయి. అయితే, ప్రతిసారి అదే తరహా సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని భావించే రవితేజ, అప్పుడప్పుడూ భిన్నమైన, క్లాస్ టచ్ ఉన్న కథలను కూడా ప్రయత్నిస్తుంటారు. అయితే, ఆ తరహా చిత్రాల్లో విజయాలు తక్కువే. అందుకే మళ్లీ మాస్ చిత్రాలకే ఓటేస్తుంటారు.

ప్రస్తుతం రవితేజ “మాస్ జాతర” అనే పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన ఏ సినిమా చేయబోతున్నారు అన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం రవితేజ ఈసారి ఓ క్లాస్ డైరెక్టర్‌తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.

“నేను శైలజ”, “ఉన్నది ఒక్కటే జిందగీ”, “చిత్రలహరి” లాంటి భావోద్వేగభరితమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ తిరుమల ఇప్పుడు రవితేజతో సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

చిత్రలహరి తర్వాత కిషోర్ తిరుమలకి సరైన హిట్ అందలేదు. “రెడ్”, “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ముఖ్యంగా శర్వానంద్‌తో చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు పూర్తిగా నిరాశపరిచింది. దాంతో కిషోర్ తిరుమల మూడు సంవత్సరాలుగా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు రవితేజ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇదివరకు కిషోర్ “అనార్కలి” అనే కథ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ ప్రాజెక్ట్‌కు సరైన హీరో దొరకలేదు. ఇప్పుడు రవితేజతో అదే కథను తెరకెక్కిస్తారా? లేక కొత్త కథపై పని జరుగుతోందా? అన్నది చూడాల్సిన విషయమే.

అయితే, రవితేజ సినిమాకు కిషోర్ తిరుమల పూర్తిగా క్లాస్ టచ్ ఇచ్చినా వర్కౌట్ కావడం కష్టం. అందుకే, ఈ కథలో క్లాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, మాస్ అంశాలను పుష్కలంగా కలిపే అవకాశం ఉంది. మాస్ రాజా & కిషోర్ తిరుమల కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో, రవితేజ కెరీర్‌లో ఇది కొత్త మలుపు తిప్పుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.

తప్పకుండా రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది


Recent Random Post: