రజినీకాంత్ భక్తుడిని.. ‘కూలీ’పై విమర్శలు పట్టించుకోను: ఉపేంద్ర

Share


ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసిన నటుడు. అలాంటి నటుడు ఒక సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడంటే, ఆ పాత్రకు గట్టి నిడివి, కథలో కీలక ప్రాధాన్యం ఉంటుందనే అంచనాలు సహజంగానే ఏర్పడతాయి. అయితే ‘కూలీ’ సినిమాలో ఉపేంద్ర పాత్ర విషయంలో ఈ అంచనాలు నెరవేరలేదు. ఆయన క్యారెక్టర్ అభిమానులను మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా నిరాశకు గురి చేసింది.

ఈ చిత్రంలో హీరో రజినీకాంత్‌తో పాటు ఉపేంద్ర పాత్ర కూడా ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదన్న అభిప్రాయం వినిపించింది. ముఖ్యంగా ఉపేంద్ర క్యారెక్టర్ చాలా తేలికగా, ప్రభావం లేకుండా ఉండటం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ‘కూలీ’లో మీ పాత్రపై వచ్చిన నెగటివ్ టాక్ గురించి, ఇంత ప్రాధాన్యం లేని క్యారెక్టర్‌ను ఎందుకు ఒప్పుకున్నారని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఉపేంద్ర ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

‘‘కూలీ సినిమా విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు. అది నాకు కలలో కూడా ఊహించని అవకాశం. ఎందుకంటే అది రజినీకాంత్ సినిమా. నేను ఆయనకు కేవలం ఫ్యాన్ మాత్రమే కాదు… భక్తుడిని. ఆయన సినిమాలో నటించడం అనేది నా జీవితంలో చాలా పెద్ద విషయం. రజినీతో కలిసి ఒకే ఒక షాట్‌లో కనిపించినా చాలు, నేను చేయడానికి సిద్ధమే. అందుకే ఆ పాత్ర ఎంత పెద్దది, ఎంత ముఖ్యమైనదన్నది కూడా ఆలోచించకుండా సినిమా ఒప్పుకున్నా’’ అని ఉపేంద్ర చెప్పాడు.

మొదట తన పాత్ర కేవలం ఒక చిన్న ఫైట్ సీన్‌కే పరిమితమైందని, ఆ తర్వాత దర్శకుడు ఆ క్యారెక్టర్‌ను కొంచెం డెవలప్ చేసి మరికొన్ని సన్నివేశాలు జోడించారని కూడా ఉపేంద్ర వెల్లడించాడు.

రజినీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని మరింతగా వివరించిన ఉపేంద్ర, ‘‘రజినీ అంటే నాకు పిచ్చి. ఆయన సినిమాలకన్నా ఎక్కువగా ఆయన ఫిలాసఫీకి నేను వీరాభిమానిని. ‘నేను ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే’, ‘దేవుడు శాసిస్తాడు… అరుణాచలం పాటిస్తాడు’ వంటి డైలాగులు నాపై చాలా ప్రభావం చూపాయి. ఆయనకు సంబంధించిన చిన్న వీడియో వచ్చినా అదే పనిగా చూస్తుంటా’’ అని చెప్పాడు.

‘జైలర్’ సినిమా ఆడియో వేడుకలో రజినీకాంత్ చేసిన దీర్ఘ ప్రసంగాన్ని ప్రస్తావించిన ఉపేంద్ర, ‘‘గంటసేపు మాట్లాడిన ఆ స్పీచ్ వింటుంటే ఇక ఆయన సినిమాలు చూడాల్సిన అవసరమే లేదనిపించింది. అలాంటి స్పీచ్‌లు వింటూ ఉంటే చాలు. నాకు ఆయనంటే అంత అభిమానం’’ అంటూ తన మనసులోని మాటను స్పష్టంగా వెల్లడించాడు.


Recent Random Post: