రాజకీయాల్లో విజ‌య్… సినిమాలకు రీఎంట్రీ ఉంటుందా?

Share


అభిమానుల కోసం అయినా విజ‌య్ మ‌ళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తారా? ప్రస్తుతం ఈ ప్రశ్నే ఆయన అభిమానులను వెంటాడుతోంది. రాజకీయాల్లోకి వెళ్లినా, ఏదో ఒక దశలో రీఎంట్రీ ఇస్తారేమో అన్న ఆశ మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఇదే విషయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉదాహరణను అభిమానులు గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఇక సినిమాలు చేయనని, రిటైర్మెంట్ ప్రకటించిన పవన్, రాజకీయ అనుభవం వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా సుజిత్ లాంటి యాక్షన్ డైరెక్టర్ ముందే తగిలి ఉంటే అసలు రాజకీయాల్లోకి వెళ్లేవాడిని కాదని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ నటి, నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నటి, నిర్మాత సింథియా లూర్డే స్వీయ నిర్మాణంలో ‘అణిలి’ అనే చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ, దళపతి విజ‌య్ తప్పకుండా ఒక రోజు సినిమాలకు రీఎంట్రీ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, తాను కూడా భవిష్యత్తులో విజ‌య్‌తో కలిసి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. రాజకీయ ప్రవేశం కారణంగా ఆ అవకాశం ఇప్పటికి వాయిదా పడినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం అది తప్పక జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

అయితే ప్రస్తుతం విజ‌య్ కమిట్‌మెంట్స్‌ను చూస్తే ఆయన మళ్లీ సినిమాల్లోకి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఆయనతో పనిచేయాలనుకున్న పలువురు దర్శకులు, నటులు తీవ్ర నిరాశలో ఉన్నారు. విజ‌య్ స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయినవారు చాలామందే ఉన్నా, వారిలో చాలా మందికి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. పరిశ్రమలోనే ఉంటున్నారు కదా… ఎప్పుడో ఒకరోజు ఛాన్స్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నవారు కూడా, విజ‌య్ పూర్తిగా రాజకీయాల వైపు మళ్లుతారని ఊహించలేకపోయారు. దీంతో ఇక ఆయనతో పని చేయడం సాధ్యం కాదనే నిర్ణయానికి చాలామంది వచ్చేశారు.

దళపతి విజ‌య్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘జన నాయగన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇదే ఆయన చివరి సినిమా అని ఇప్పటికే స్పష్టం చేశారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో విజ‌య్‌ను చివరిసారి చూసే అవకాశం ఇదే కావచ్చని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆయన మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

ప్రస్తుతం విజ‌య్ తమిళనాడు రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టారు. ఎలాంటి పొత్తులు లేకుండా సోలోగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎంతో సీరియస్‌గా ఉన్నారు. ‘జన నాయగన్’ షూటింగ్‌లో పాల్గొంటూనే, రాజకీయంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలు, అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అభిమానుల ఆశలు, సినీ వర్గాల అంచనాలు, సింథియా లూర్డే వంటి వారి ధీమా… ఇవన్నీ చూస్తే దళపతి విజ‌య్ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.


Recent Random Post: