రాజమౌళితో పోలికపై అనిల్ రావిపూడి వినయపూర్వక స్పందన

Share


మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. వరుసగా తొమ్మిది విజయాలతో 100 శాతం సక్సెస్ రేటును కొనసాగిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడిని, ఇప్పుడు చాలామంది దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో పోలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జరిగిన సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి ఈ పోలికలపై చాలా వినయంగా స్పందించారు.

తనను రాజమౌళి గారితో పోలుస్తున్నారంటే అది తన జీవితంలోనే అతిపెద్ద గౌరవం, బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అని అనిల్ చెప్పారు. రాజమౌళి గారు ఒక ఐకానిక్ డైరెక్టర్ అని, ఆయనను తాను ఎంతో గౌరవిస్తానని స్పష్టం చేశారు. కేవలం కొన్ని విజయాల వల్ల రాజమౌళి గారి స్థాయికి చేరిపోయానని తాను ఎప్పుడూ అనుకోనని, అలాంటి భావన తనలో లేదని అనిల్ క్లారిటీ ఇచ్చారు.

తనను రాజమౌళి గారితో పోల్చి తన స్థాయిని పెంచుకోవాలనే ఆలోచన కూడా తనకు లేదని, అలాగే రాజమౌళి గారి స్థాయిని తగ్గించే ఆలోచన అస్సలు లేదని ఆయన చెప్పారు. ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుందని, రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ ఫిల్మ్‌మేకర్ అని కొనియాడారు. ప్రస్తుతం తాను తనకు తెలిసిన వినోదాన్ని రీజినల్ ఆడియన్స్‌కు అందించడంపైనే ఫోకస్ చేస్తున్నానని అనిల్ తెలిపారు. రాజమౌళి గారు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటారని, ఆయన స్థాయి ఎప్పటికీ హై లెవెల్లోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇక ‘MSG’ బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన అనిల్, సినిమా కేవలం రెండు రోజుల్లోనే 120 కోట్ల గ్రాస్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపించాలనే తన చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు. ఈ స్థాయి కలెక్షన్లు సాధ్యమయ్యాయంటే అది పూర్తిగా చిరంజీవి గారి ఎనర్జీ, మ్యాజిక్ వల్లేనని చెప్పి క్రెడిట్ మొత్తం బాస్‌కే ఇచ్చేశారు.

చివరగా తనను రాజమౌళి గారితో పోలుస్తూ ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన పరిధిలో తాను ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడమే తన లక్ష్యమని అనిల్ రావిపూడి సక్సెస్ మీట్ వేదికగా స్పష్టం చేశారు.


Recent Random Post: