
పెద్ద హీరోల సినిమాలకు టైటిల్ ఎంపిక ఎంత ముఖ్యమో ఇటీవలి అనుభవాలు మళ్లీ రుజువు చేశాయి. సరైన టైటిల్ లేకపోతే సినిమా మీద బజ్ తగ్గిపోతుందనే విషయాన్ని ‘గేమ్ ఛేంజర్’ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా లేకపోవడంతో, అటు సోషల్ మీడియాలోనూ, ఇటు జనాల్లోనూ ఆ సినిమా పేరు అంతగా రిజిస్టర్ కాలేదు.
ఇప్పుడు అదే పరిస్థితి రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమాకూ ఎదురవుతుందా? అనే సందేహం ఫ్యాన్స్‌లో కలుగుతోంది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు ‘పవర్ క్రికెట్’ అనే పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు బయటకొచ్చాయి. అయితే, ఈ పేరు సినిమాకు తగినట్టుగా లేదన్న భావన ఫ్యాన్స్‌లో నెలకొంది. “ఇదొక టీవీ రియాలిటీ షోలా ఉంది కానీ, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా టైటిల్‌గా సరిపోదు” అంటున్నారు అభిమానులు.
ఇందుకు భిన్నంగా, చాలా రోజుల క్రితమే ప్రచారంలోకి వచ్చిన ‘పెద్ది’ అనే టైటిల్ బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ‘పెద్ది’ అన్న పదం తెలుగులో బాగానే అర్థమవుతున్నా, ఇతర భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అనేది ప్రశ్న. అందుకే అన్ని భాషల్లో అర్థమయ్యే టైటిల్ కోసం టీమ్ ఆలోచనలో పడింది. అయితే, కేవలం పాన్ ఇండియా కోసమే సినిమా మూల ఉద్దేశాన్ని మార్చేయకూడదనే వాదన కూడా ఉంది.
ఈ విలేజ్ డ్రామా క్రీడల నేపథ్యంలో సాగుతుందని, అందులో ముఖ్యంగా కుస్తీ, క్రికెట్ అంశాలు హైలైట్ అవుతాయని సమాచారం. పవర్ క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కథలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు సమయానికి టైటిల్ ఖరారు చేసి, టీజర్ రెడీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇంకా ఓ ఆసక్తికరమైన అంశమేంటంటే, ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కూడా నటిస్తున్నారు. ఇటీవల అమెరికాలో క్యాన్సర్ చికిత్స పూర్తి చేసుకున్న ఆయన, ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే ఆర్సీ16 సెట్స్‌లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. అంతేకాక, ‘జైలర్ 2’తో పాటు కన్నడలో కమిటైన మరికొన్ని సినిమాలకు ఆయన డేట్స్ ఇవ్వాల్సి ఉంది.
ఏది ఏమైనా, వీలైనంత త్వరగా టైటిల్ ఫైనల్ చేస్తే, సినిమాపై హైప్ పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, టీమ్ టీజర్ విడుదల చేయాలని కూడా భావిస్తోంది. టైటిల్ సరైనదైతే, సినిమా మీద అంచనాలు మరో స్థాయికి వెళ్లడం ఖాయం!
Recent Random Post:














