
కాలానికి తగ్గట్టు అలవాట్లు, నిర్ణయాలు మార్చుకోకపోతే సినిమా రంగంలో నిలదొక్కుకోవడం కష్టమే. ఇదే సత్యాన్ని మాస్ మహారాజా రవితేజ చాలా ముందే అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే తన కెరీర్‌లో గేర్ మార్చి, కొత్త దారిలో ప్రయాణం మొదలుపెట్టాడన్న చర్చలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
ఇంతకాలం వరకు రవితేజ సినిమా అంటే నిర్మాతలు ఆయన అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందే అన్న ఇమేజ్ ఉంది. డిమాండ్–సప్లై అన్నట్టుగా ఆయన వ్యవహరించేవాడని, హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా తన రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి తగ్గింపులు ఉండవని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో గుసగుసలు వినిపించేవి. కానీ గత మూడు సంవత్సరాలుగా వరుస ఫ్లాపులు ఎదురవుతుండటంతో పరిస్థితి మారినట్టుగా కనిపిస్తోంది.
ధమాకా తర్వాత మాస్ రాజాకు చెప్పుకోదగ్గ హిట్ లేకపోయినా, ఇప్పటివరకు తన పారితోషికంపై ఎక్కడా వెనక్కి తగ్గని రవితేజలో తాజాగా మార్పు కనిపిస్తోంది. తాజా ప్రాజెక్ట్‌ల విషయంలో ఆయన తన రెమ్యూనరేషన్ తగ్గించుకుని, లాభాల్లో షేర్ తీసుకునే మోడల్‌కి షిఫ్ట్ అయ్యాడని సమాచారం. ఇది నిర్మాతలకు కూడా ఊరటనిచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు.
ఈ కొత్త పంథాతో పాటు రవితేజ సరికొత్త ప్రయోగాలకు కూడా సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే కాకుండా, తనకు పూర్తిగా భిన్నమైన జానర్లలో అడుగులు వేస్తూ రవితేజ దర్శకుడు శివ నిర్వాణతో థ్రిల్లర్ మూవీ ఇరుముడి, అలాగే యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో ఓ సైఫై మూవీ చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే, మాస్ మహారాజా మారుతున్న కాలానికి తగ్గట్టు తన వ్యూహాన్ని మార్చుకుని, కొత్త దారిలో ముందుకెళ్తున్నాడన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
Recent Random Post:















