
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన దర్శకుల్లో లోకేష్ కనకరాజ్ ఒకరు. మానగరం చిత్రంతో దర్శకుడిగా శుభారంభం చేసిన ఆయన, ఖైదీ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా నిలిచాడు. అనంతరం వచ్చిన మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో తనదైన ముద్రవేశాడు. ప్రస్తుతం కూలీ అనే యాక్షన్ ఎంటర్టైనర్తో బిజీగా ఉన్న లోకేష్, త్వరలో దర్శకుడిగా కాకుండా హీరోగా కూడా వెండితెరకు పరిచయం కానున్నాడు.
ప్రముఖ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా నటించబోయే ఈ చిత్రం ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా లోకేష్ వెల్లడించారు. ఈ పాత్ర కోసం ఆయన ఇప్పటికే కండలు పెంచడం, బరువు తగ్గడం, గడ్డం పెంచడం వంటి శారీరక మార్పులు మొదలుపెట్టినట్లు తెలిపారు. అంతేకాక, ఖైదీ-2 షూటింగ్ మొదలయ్యేలోపు – అంటే వచ్చే ఎనిమిది నెలల వ్యవధిలో ఈ సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ఇప్పటికే ఇనిమేల్ అనే మ్యూజిక్ వీడియోలో శ్రుతి హాసన్‌తో కలిసి నటించిన లోకేష్, తన నటనా నైపుణ్యంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్‌లో హీరోగా మెరవడానికి సిద్ధమవుతున్నారు. ఆయనకు దర్శకుడిగా ఉన్న క్రేజ్, నటుడిగా చేస్తున్న ఈ ప్రయోగానికి మరింత బలాన్నిచ్చే అవకాశం ఉంది.
ఇక కూలీ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత ఖైదీ-2, విక్రమ్-2, రోలెక్స్, ఆమిర్ ఖాన్‌తో ప్లాన్ చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో పాటు మరో భారీ ప్రాజెక్టులపై లోకేష్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Recent Random Post:














