వివాదాల్లో రామ్ గోపాల్ వర్మ – పోలీసుల విచారణలో హాజరు

Share


వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు పొందిన రామ్ గోపాల్ వర్మ, సినిమాలతో పాటు తన కాంట్రవర్సీ వ్యాఖ్యలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ అంశాలపై చేసే వ్యాఖ్యలు కూడా ఆయనను పోలీసుల దృష్టిలోకి తీసుకువచ్చాయి.

గతంలో వ్యూహం సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఒంగోలు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు నమోదైంది. హైకోర్టు నుంచి బెయిల్ పొందిన వర్మకు, విచారణకు హాజరుకావాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరిలో ఒకసారి హాజరైన ఆయన, తాజాగా మరోసారి ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత నెల 22న అందిన నోటీసుల ప్రకారం ఈ విచారణ జరుగుతోంది. ఈసారి పోలీసులు ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారు, వర్మ ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

వర్మ సినీ ప్రయాణం చూస్తే—మాఫియా, హారర్ నేపథ్యం కలిగిన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, శివ, క్షణక్షణం వంటి తెలుగు సినిమాలతో పాటు రంగీలా, సత్య, కంపెనీ, భూత్ వంటి హిందీ చిత్రాలతో కూడా మంచి పేరు సంపాదించారు. ‘వర్మ కార్పొరేషన్’ పేరుతో పలు చిత్రాలను నిర్మించారు.

1962 ఏప్రిల్ 7న తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన వర్మ, సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో చదివి, విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు కంటే సినిమాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో, రావుగారి ఇల్లు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలుపెట్టి, అక్కినేని నాగార్జున నటించిన శివ సినిమాతో దర్శకుడిగా మారారు. అద్భుతమైన దర్సకత్వంతో నంది అవార్డులు గెలుచుకున్న వర్మ, ఇటీవలి కాలంలో అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమాల వల్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు.


Recent Random Post: