విశ్వక్ సేన్ సినిమాకు పోటీగా అర్జున్ ‘సీతా పయనం’?

Share


కోలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా అప్పట్లో ఓకే కావడం, అనంతరం కొన్ని కారణాల వల్ల విశ్వక్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం తెలిసిందే. ఈ విషయంలో అర్జున్ హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కమిట్‌మెంట్ లేదని, ఇచ్చిన మాటపై నిలబడడని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.

అయితే ఆ సమయంలో మౌనం పాటించిన విశ్వక్, కొంతకాలం తర్వాత తాను ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో స్పష్టత ఇచ్చాడు. దాంతో ఆ వివాదం క్రమంగా చల్లబడింది. విశ్వక్ తప్పుకోవడంతో అర్జున్ ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్టే అనిపించినా, తర్వాత మళ్లీ దానిని సెట్స్‌పైకి తీసుకెళ్లి షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధం చేశారు.

ఆ సినిమానే ‘సీతా పయనం’. ఇందులో నిరంజన్ సుధి హీరోగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా నటించారు. అలాగే ధృవ్ సర్జా, సత్యరాజ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మేకర్స్ ఈ సినిమాను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.

ఇదిలా ఉండగా, సరిగ్గా దానికి ఒక్కరోజు ముందే విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారం విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు రిలీజ్‌ను ముందుకు తెచ్చి ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అర్జున్ దర్శకత్వంలో రూపొందిన ‘సీతా పయనం’ కూడా అదే వారంలో విడుదల కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కావాలనే విశ్వక్ సినిమా కు పోటీగా ప్లాన్ చేశారా? లేక విశ్వక్ సినిమా కంటే తమ సినిమా బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుందనే నమ్మకంతో ఈ డేట్ ఎంచుకున్నారా అన్నది తెలియదు కానీ, మొత్తానికి ‘సీతా పయనం’ మాత్రం ఇప్పుడు మంచి అటెన్షన్‌ను దక్కించుకుంది.


Recent Random Post: