శిల్పా శిరోద్కర్‌కు ‘జఠాధర’తో టాలీవుడ్ రీ-ఎంట్రీ!

Share


సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య న‌మ్రతా శిరోద్కర్ అక్క‌ అయిన శిల్పా శిరోద్కర్ సినీ ప్రేక్షకులకు కొత్త కాదు. మూడు దశాబ్దాల క్రితమే ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘బ్రహ్మ’ అనే చిత్రంతో వచ్చారు. అయితే ఆ సమయంలో సోషల్ మీడియా లేకపోవడంతో ఆ సినిమా పెద్దగా గుర్తింపు పొందలేదు. తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినా, అగ్రనటిగా ఎదగలేకపోయారు.

ఇటీవల శిల్పా శిరోద్కర్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జఠాధర సినిమాలో ఆమెకు కీలక పాత్ర దక్కింది. ఈ చిత్రంతో తెలుగు తెరపై ఆమె రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

“బ్రహ్మ సినిమాతో టాలీవుడ్‌లో నా ప్రయాణం ప్రారంభమైంది. అయితే ఆ సినిమా విజయం సాధించినప్పటికీ, మరిన్ని అవకాశాలు రాలేదు. ఇప్పుడు జఠాధరతో తిరిగి తెరపై కనిపించబోతున్నాను. ఈ సినిమా నాకు మంచి కంబ్యాక్ అవుతుందనే నమ్మకం ఉంది,” అని ఆమె తెలిపారు.

శిల్పా తెలుగులో మరిన్ని ఆఫర్లు అందుకోవాలని ఆశపడుతున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. హీరోయిన్లే ఇప్పుడు చిన్న పాత్రలు, ప్రత్యేక పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా శిరోద్కర్ కూడా తన ప్రతిభతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

చివరిసారిగా 2020లో బాలీవుడ్‌లో గన్స్ ఆఫ్ బనారస్ చిత్రంలో నటించిన ఆమె, ఆ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చారు. ఇప్పుడు జఠాధర ద్వారా తెలుగులో కంబ్యాక్ ఇస్తుండటం ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన మలుపుగా చెప్పుకోవచ్చు.


Recent Random Post: