శేఖర్‌ కమ్ముల కొత్త సినిమా అధికారిక ప్రకటన

Share


దర్శకుడు శేఖర్‌ కమ్ముల సినీ ప్రస్థానం ప్రారంభమై 25 ఏళ్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు కేవలం 10 మాత్రమే. ప్రతి రెండు మూడు ఏళ్లకోసారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే శేఖర్‌ కమ్ముల… తన ప్రత్యేకమైన కథా శైలి, నెమ్మదిగా కానీ నిశితంగా చేసే మేకింగ్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇటీవల కుబేర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కమ్ముల, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తిచేసిన ఆయన, ఈ సినిమాను లవ్ స్టోరీ మరియు కుబేరలను నిర్మించిన సునీల్ నారంగ్‌, రామ్మోహన్‌ల నిర్మాణ సంస్థలోనే చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా ఏషియన్ మూవీస్ ఈ విషయాన్ని ప్రకటించడం సినిమాపై అంచనాలను పెంచింది.

ఒకే బ్యానర్‌లో వరుసగా మూడు సినిమాలు చేయడం తెలుగు ఇండస్ట్రీలో అరుదు. కానీ, శేఖర్‌ కమ్ముల – సునీల్ నారంగ్‌ కాంబినేషన్‌ బలంగా కొనసాగుతోంది. లవ్ స్టోరీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, కుబేర 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు భారీగా లాభాలను అందించింది. దీంతో వారు కమ్ముల‌తో మరిన్ని సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం ఈ కొత్త సినిమా గురించి హీరో, హీరోయిన్‌ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే కమ్ముల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.


Recent Random Post: