
టాలీవుడ్లో సెన్సిటివ్ సినిమాలకు synonym గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. కథానాయకుడిగా తమిళ స్టార్ ధనుష్, కీలక పాత్రలో అక్కినేని నాగార్జునతో రూపొందించిన కుబేరా సినిమా ద్వారా ఈసారి తన రూట్ మార్చారు. జూన్ 20న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శేఖర్ కమ్ముల తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి అనేక విషయాలు వెల్లడించారు. “ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లైపోయాయంటే నాకే నమ్మలేకపోతున్నా. ఈ ప్రయాణం చాలా తృప్తికరంగా ఉంది. కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నా,” అంటూ ప్రారంభించారు.
తన సినిమాలు తనలాగే సింపుల్‌గా ఉంటాయని చెప్పిన కమ్ముల, “నాకు ఉన్న ఆర్థిక స్థితిని, బ్యాక్‌గ్రౌండ్‌ను దృష్టిలో పెట్టుకుని నేనెప్పుడూ సినిమాలు చేస్తూ వచ్చాను. ఒకప్పుడు ఫ్రెండ్స్ వద్ద డబ్బులు అప్పుగా తీసుకొని సినిమాలు చేశాను. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను,” అన్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎటువంటి ఘోరమైన పరాజయాలు ఎదురుకాలేదని చెప్పారు.
“నాకు ఈ స్థాయికి రావడంలో ఆడియన్స్ చూపించిన ప్రేమే ప్రధాన కారణం. దాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా భావోద్వేగానికి లోనవుతుంటాను. కొంతమంది, ‘ఇండస్ట్రీలో పాతికేళ్లు అయిపోయినా పది సినిమాలే చేశారా?’ అంటారు. కానీ నాకు అదే చాలిపోతుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. ఎవరిపై ఎక్కువ అంచనాలు పెట్టను. ఎవరి నుంచి ఏదీ ఆశించను. అందుకే బాధ అనిపించదు,” అని చెప్పారు.
“సినిమా లాభాల్లో ఎప్పుడూ వాటా అడగలేదు. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నాను. ఆ విషయంలో కొంత నష్టపోయాను. కానీ ఆడియెన్స్ ఆదరణ ఉన్నప్పుడు అదే పెద్ద గెలుపుగా భావిస్తాను,” అని తనంతట తానే తృప్తిగా ఉన్నట్టు చెప్పారు శేఖర్ కమ్ముల.
ఈసారి ఆయన ప్రయోగం అయిన కుబేరా ఏ స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో చూడాలి!
Recent Random Post:















