సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘ది రాజా సాబ్‌’

Share


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం **ది రాజా సాబ్‌**పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రభాస్ తన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్లకు పూర్తి భిన్నంగా, ఫస్ట్ టైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా చేయడం విశేషం. భయపెడుతూనే వినోదాన్ని అందించేలా ఈ సినిమా రూపొందుతోందని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ నటులు సంజయ్ దత్‌, బోమన్ ఇరాని, అలాగే సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దర్శకుడు మారుతికి ఇది తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు, తొలి స్టార్ హీరో మూవీ కావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇదే సమయంలో ప్రభాస్ అభిమానుల్లో కొంత సందేహం కూడా కనిపించింది.

ఇదిలా ఉండగా, ది రాజా సాబ్‌ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ అదే సమయంలో రణ్‌వీర్ సింగ్ నటించిన సెన్సేషనల్ చిత్రం ధురంధర్‌ విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ‘అవతార్ 3’ మేనియా ఉన్నప్పటికీ, ధురంధర్ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ రికార్డులు తిరగరాస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్‌లో ది రాజా సాబ్‌ రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద తీవ్ర ప్రభావం పడేదని ముందే అంచనా వేసిన డిస్ట్రిబ్యూటర్లు, రిలీజ్‌ను వాయిదా వేయాలని మేకర్స్‌కు సూచించారట. సంక్రాంతి బరిలో విడుదలైతే సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుందని చెప్పడంతో, ఆ సూచనను సీరియస్‌గా తీసుకున్న మేకర్స్ జనవరి 9కి రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశారని సమాచారం.

ఒకవేళ డిసెంబర్‌లోనే సినిమా విడుదలై ఉంటే ధురంధర్‌తో పెద్ద క్లాష్ తప్పదని, అది బాక్సాఫీస్ రెవెన్యూను తీవ్రంగా దెబ్బతీసేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సమయానికి సరైన నిర్ణయం తీసుకుని ఈ ప్రమాదం నుంచి తెలివిగా తప్పించుకున్నారని విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం సంక్రాంతి రిలీజ్ కోసం ది రాజా సాబ్‌ టీమ్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 27న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్, సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో తెలుసుకోవాలంటే జనవరి 9 వరకూ వేచి చూడాల్సిందే.


Recent Random Post: