
తమిళంలో పవర్‌ఫుల్ పాత్రలతో హీరోయిన్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. తాజాగా ఆమె మొదటిసారి దర్శకురాలిగా, నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా “సరస్వతి”. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు టాలీవుడ్ ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా కథ అందించారని చెప్పబడింది.
అయితే సినిమా విడుదలైన తర్వాత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కథను పూర్తిగా మార్చేశారని, తాను ఇచ్చిన కథను చివరికి “ఖూనీ” చేశారని, “నా కథను రేప్ చేశారు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో సినిమా టీమ్ శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సాయి మాధవ్ బుర్రా చేసిన ఆరోపణలపై వరలక్ష్మీ శరత్‌కుమార్ స్పందించారు. సాయిగారి మీద తనకు చాలా గౌరవం ఉందని ఆమె మొదట చెప్పింది. “ఆయన ఒక సీనియర్ రైటర్. ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అయితే ఒక కథను అలాగే చెప్పితే నేటి ప్రేక్షకులు అంగీకరించరు. అందుకే కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది” అని వెల్లడించింది.
అంతేకాకుండా, “నేను ఎవరి కథను దొంగిలించలేదు. మేము కాంట్రాక్ట్ చేసుకున్నాం. డబ్బులు కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఆ కథపై మాకు హక్కులు వచ్చాయి. ఆ కథ సాయిగారి దగ్గర దాదాపు ఆరు సంవత్సరాలుగా ఉంది. అంత బాగుంటే ఆయన ఎందుకు సినిమా చేయలేదు?” అని ప్రశ్నించింది.
తాను కథ చెప్పిన ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ బలహీనంగా ఉందని చెప్పారని, అందుకే స్క్రీన్‌ప్లేను మార్చి కొత్తగా రూపొందించాల్సి వచ్చిందని వరలక్ష్మీ తెలిపారు. “సాయిగారు చాలా బిజీగా ఉండేవారు. ఆయనను కలిసి కూర్చొని పని చేయడం కూడా సాధ్యపడలేదు. ఆయన మొత్తం కథను ఒక ఆడియో నోట్ రూపంలో పంపించారు. ఆ ఆడియో ఆధారంగా నేనే కథపై పనిచేశాను” అని వివరించింది.
తాను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా కథ లైన్ మాత్రం సాయి మాధవ్ బుర్రాదేనని చెప్పానని, ఆయనపై గౌరవం ఉన్నందుకే స్టోరీ క్రెడిట్ కూడా ఆయనకే ఇచ్చామని వరలక్ష్మీ స్పష్టం చేసింది. “కావాలంటే నా పేరు కూడా వేసుకోవచ్చు. కానీ గౌరవంతో ఆయన పేరే వేశాను” అని ఆమె అన్నారు.
ఇంకా మాట్లాడుతూ, “మేము పెద్ద స్టార్లు కాదు. మంచి నటులమే. కాబట్టి కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన పాల్గొనలేదు. తాను పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. ఇప్పుడు ఇలా ‘కథను రేప్ చేశారు’ అనడం చాలా ఇన్‌సెన్సిటివ్‌గా ఉంది” అని ఆమె అభిప్రాయపడింది.
సెన్సిటివ్ అంశంపై సినిమా తీసిన సమయంలో అలాంటి పదాలు ఉపయోగించడం సరైంది కాదని, తాను ఎవరికీ అవమానం కలిగించేలా మాట్లాడదలచుకోలేదని వరలక్ష్మీ అన్నారు. ఈ వివాదంలో తన వెర్షన్‌ను చెప్పానని, ఇకపై ఈ విషయంపై తాను మరింత దిగజారే వ్యాఖ్యలు చేయనని తెలిపారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ విషయంపై సాయి మాధవ్ బుర్రా ఎలా స్పందిస్తారు? ఆయన నుంచి ఎలాంటి వివరణ వస్తుంది? అన్నది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:















