సాయి తేజ్ భారీ ఆశలతో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా

Share


మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ కెరీర్ గ‌డిచిన కొంత‌కాలంగా పెద్ద‌గా జోరుగా లేదు. అనుకోకుండా యాక్సిడెంట్ కావ‌డం, ఆ త‌ర్వాత లాంగ్ గ్యాప్ రావ‌డం అత‌ని ప్ర‌యాణాన్ని కొంత‌వర‌కు ఆటంక‌ప‌రిచాయి. అయితే విరూపాక్ష విజయంతో మళ్లీ బౌన్స్‌బ్యాక్ అయ్యాడు. అయితే ఆ త‌ర్వాత చేసిన బ్రో సినిమా మాత్రం ఆడియెన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

బ్రో సినిమా త‌ర్వాత సాయి తేజ్ కొంత గ్యాప్ తీసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. ఈ సమయంలో రోహిత్ కేపీ అనే నూతన దర్శకుడు చెప్పిన క‌థ‌ను న‌చ్చ‌గా, తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ‘సంభరాల ఏటి గట్టు’ అనే పాన్ ఇండియా యాక్షన్ డ్రామా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది.

సుమారు ₹100 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ ప్రాజెక్ట్‌ను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆధారంగా చూస్తే, సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగనుందని స్పష్టమైంది. అయితే, తాజా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ కథ భారత స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో ఉంటుంది. బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసి, రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణకు పాటుపడిన ఓ వీరుని గాథగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంపై సాయి తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో తేజు తన శక్తి మేరకు కష్టపడుతున్నాడని, సినిమాపై అతనికి ఉన్న ఆత్మీయ నమ్మకమే విజయాన్ని అందించగలదని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: