
టాలీవుడ్ యంగ్ హీరోలు ఇప్పుడు కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ వేదికలపై కూడా తమ ప్రతిభను చూపించాలని చూస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత అవకాశాలు తగ్గిపోతే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్ ఓటీటీ సినిమాలు కూడా మంచి అవకాశాలుగా మారాయి.
నవీన్ చంద్ర ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూనే, స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అలాగే ఓటీటీ వేదికలపై క్రైమ్ థ్రిల్లర్లు, వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇదే మార్గాన్ని మరికొంతమంది యంగ్ హీరోలు అనుసరిస్తున్నారు.
సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’తో ఓటీటీ దారిని ఎంచుకోగా, ఆనంద్ దేవరకొండ ‘తక్షకుడు’ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌గా చేస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ కూడా కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘డీజే టిల్లు’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సిద్ధూ, ‘టిల్లు స్క్వేర్’తో మరో విజయాన్ని సాధించాడు. అయితే మొదటి భాగం స్థాయిలో మాత్రం ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడనే అభిప్రాయం ఉంది. తర్వాత చేసిన ‘జాక్’, ‘తెలుసు కదా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
ప్రస్తుతం ‘టిల్లు క్యూబ్’ అనే టైటిల్‌తో మరో భాగాన్ని ప్లాన్ చేస్తున్న సిద్ధూ, దానికి ముందు ఓ వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix కోసం ఈ సిరీస్ రూపొందనుంది. దీనికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని టాక్.
ఇది సిద్ధూ నటించే తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ఓటీటీలో మంచి స్పందన లభిస్తే మరిన్ని సిరీస్‌లు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా, ఓటీటీలో కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చని గతంలో కొందరు హీరోలు నిరూపించారు. అదే నమ్మకంతో సిద్ధూ కూడా ముందడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇక సిద్ధూ ప్రస్తుతం ‘బదాస్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి రవికాంత్ పేరుపు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘విశ్వనాథం అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.
Recent Random Post:















