సిరివెన్నెల కృషి వల్ల రచయితలకు రాయల్టీ భవిష్యత్తు

Share


సినిమా పరిశ్రమలో పాటల రచయితలకు ఆదాయం ఎలా వస్తుందో సాధారణ ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదు. చాలా మంది అనుకుంటారు, “సినిమాకు పాట రాసినప్పుడు ఇచ్చే పారితోషికమే రచయితకు వచ్చే మొత్తం.” కానీ ఒకప్పుడు సినిమా పాటల రచయితల పరిస్థితి చాలా భేదభరితమైనది. చేతిలో కలం, మెదడులో పదును ఉన్నంతకాలమే వారికి విలువ. వయసు పెరిగిన తర్వాత అవకాశాలు తగ్గినప్పుడు, ఎంతోమంది ప్రముఖ రచయితలు కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు.

అయితే, నేటి తరపు రచయితలకు అలాంటి సమస్య రాకూడదని, వారికి స్థిరమైన భవిష్యత్తును అందించేందుకు కృషి చేసినది దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత చంద్రబోస్ ఎంతో ఎమోషనల్‌గా గుర్తు చేసుకున్నారు.

చంద్రబోస్ చెప్పినట్లుగా, సిరివెన్నెల గారు కేవలం పారితోషికమే కాదు, పాట వినిపించే ప్రతిసారి రచయితకు రాయల్టీ రావాలని చాలా ప్రాధాన్యం ఇచ్చారు. దీనికోసం ఆయన తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి, దాదాపు ఆరు నెలల పాటు న్యాయశాస్త్ర పుస్తకాలను చదివారు. లాయర్లతో చర్చించి, నిర్మాతలతో పోరాడి IPRS (ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ) ద్వారా రచయితలకు హక్కులు సాధించారన్నారు. చంద్రబోస్ చెబుతున్నట్లు, సిరివెన్నెల గారి ఆ యుద్ధం వల్లే ఈరోజు రచయితల కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగా ఉన్నాయి.

ఇప్పుడు ఒక పాట ప్రజల్లోకి వెళ్లిన తర్వాత అది ఎక్కడ వినిపించినా, రచయితకు డబ్బులు వస్తాయి. టీవీలు, రేడియోలు, విమానాశ్రయాలు, హోటళ్లు, పబ్బులు, పార్టీలు, రియాలిటీ షోలు – ఎక్కడ వినిపించినా రచయితకు రాయల్టీ లభిస్తుంది. ఉదాహరణకు, ఒక పాట ద్వారా వచ్చే 1 రూపాయి ఆదాయం నుంచి 25 పైసలు రచయితకు, 25 పైసలు సంగీత దర్శకుడికి, మిగిలిన 50 పైసలు ఆడియో కంపెనీ లేదా నిర్మాతకు వెళ్తుంది అని చంద్రబోస్ వివరించారు.

చంద్రబోస్ మరో ఉదాహరణ చెప్పారు. ఆవారా సినిమాలోని ‘చిరు చిరు చినుకై కురిసావే…’ పాటకు అప్పట్లో ఆయనకు ఇచ్చిన పారితోషికం కేవలం 25 వేల రూపాయలు మాత్రమే. కానీ ఆ పాట ప్రేక్షకుల మధ్య హిట్ కావడంతో, ఇప్పటివరకు కేవలం రాయల్టీల రూపంలోనే ఆ పాట ఆయనకు 10 లక్షల రూపాయలు ఇచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఉన్నంతకాలమే డబ్బు కనిపిస్తుంది. కానీ రాయల్టీ సిస్టమ్ వల్ల పాట బతికున్నంతకాలం రచయితకు ఆదాయం అందుతుంది. ఇది ఒక రకంగా పెన్షన్ లాగా పనిచేస్తుంది. చంద్రబోస్ చెప్పినట్లు, “అనాడు సిరివెన్నెల గారు పడ్డ కష్టమే, ఈ రోజున మాకు శ్రీరామరక్షగా మారింది.”


Recent Random Post: