
కొత్త కుర్రాడు అహాన్ పాండే – కొత్త అమ్మాయి అనీత్ పద్దా జంటగా నటించిన ‘సైయ్యారా’ ఈ ఏడాది భారీ ఓపెనింగ్ సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఆయనకు ఇది ఆషికీ 2, ఏక్ విలన్ తరువాత కెరీర్‌లో మరో గొప్ప హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా స్పందించి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోహిత్ సూరి దిశానిర్దేశం, అలాగే అహాన్, అనీత్‌ల నటనను మెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అహాన్, అనీత్‌లపై ప్రశంసల జల్లు కురిపించింది.
“ఇద్దరు అందమైన తారలు పుట్టారు. ఇద్దరి నటన చూసి నేను మంత్రముగ్ధులయ్యాను. ఎప్పుడూ నేను ఇలా ఇద్దరు నటులపై ఈ స్థాయిలో ఆశ్చర్యపడలేదు. మీ కళ్ళలోని మెరుపులు… మీరు చూపిన నిజాయితీ, మునుపెన్నడూ చూడలేదు. మీరిరువురిని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. నిజంగా ఈ సినిమాను మరోసారి చూడాల్సిందే” అంటూ అలియా ఎమోషనల్‌గా రాసింది.
అలాగే మోహిత్ సూరి పై కూడా ఆమె ప్రత్యేకంగా స్పందించింది. “ఎంత అద్భుతమైన అనుభూతి… ఎంత అద్భుతమైన సంగీతం! అలాంటి అనుభూతులు సినిమాల ద్వారానే లభిస్తాయి. సైయ్యారా హృదయంతో, ఆత్మతో నిండి ఉంది. ఇది కేవలం సినిమా కాదు… ఒక ఎమోషన్. మీ అందరికీ అభినందనలు” అంటూ ముగించింది.
ప్రస్తుతం అలియా భట్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైయ్యారా సినిమాపై సెలబ్రిటీలు ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.
Recent Random Post:















