రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం రావడం ఎవరికైనా గర్వకారణం. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈసారి ఆ అరుదైన గౌరవం ఓ యువతికి దక్కింది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ‘ఎట్ హోమ్ రిసెప్షన్’కు విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఆహ్వానం పొందుతారు. ఈ సంవత్సరం ఆ గౌరవం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తొలి మహిళా లోకోపైలట్ రితికా టిర్కీకి దక్కడం విశేషం.
27 ఏళ్ల రితిక జార్ఖండ్‌కు చెందిన గిరిజన తెగలో పుట్టి, సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఐదుగురు పిల్లలలో పెద్దదైన రితిక చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన స్వప్నాలను సాకారం చేసుకుంది. బిట్ మెస్రాలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె 2019లో సౌత్-ఈస్ట్ రైల్వే చక్రధర్‌పూర్ డివిజన్‌లో షంటర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. అక్కడి నుంచి గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడిపే స్థాయికి ఎదిగి, 2024లో టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అసిస్టెంట్ లోకోపైలట్‌గా నియమించబడి చరిత్ర సృష్టించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడిపిన తొలి మహిళగా ఆమె పేరు నిలిచిపోయింది.
రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి వచ్చిన ఆహ్వానం రితికను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ‘ఎట్ హోమ్ రిసెప్షన్’లో ఆమె పాల్గొననున్నారు. రితిక తనకు దక్కిన ఈ అరుదైన గౌరవంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇది తనలాంటి ఎన్నో యువతకు ప్రేరణగా నిలుస్తుందని చెబుతోంది. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన ఓ గిరిజన అమ్మాయి ఈ స్థాయికి ఎదగడం ఎంతో మందికి ప్రేరణగా మారుతోంది. రితిక లక్ష్యం సాధనలో చూపించిన పట్టుదలతో యువత తమ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు నూతనోత్సాహంతో అడుగులు వేస్తున్నారు.
Recent Random Post: