2025 తొలి త్రైమాసిక బాక్సాఫీస్ విశ్లేషణ

Share


2025 కొత్త సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు గడిచాయి. ఈ సమయంలో బాక్సాఫీస్ ట్రెండ్‌ను పరిశీలిస్తే, స్ట్రెయిట్ చిత్రాలతో సమానంగా డబ్బింగ్ సినిమాలు పోటీ పడటం గమనార్హం. ఇది ఒకపక్క తెలుగు మార్కెట్‌కు విస్తరణను సూచిస్తే, మరోపక్క స్థానిక సినిమాలపై పెరుగుతున్న ఒత్తిడిని చూపిస్తోంది.

జనవరిలో విడుదలైన ‘మార్కో’ భారీ విజయం సాధించకపోయినా, పెట్టుబడి తిరిగి తెచ్చుకోవడంతో పాటు లాభాలూ అందించింది. ఫిబ్రవరిలో వచ్చిన ‘ది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కేవలం నాలుగు కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తోనే మొదలై, చివరికి మూడు రెట్ల ప్రాఫిట్ అందించబోతోంది. ఇదే మాసంలో విడుదలైన ‘ఛావా’ అంచనాలకు మించి రిస్పాన్స్ అందుకుంటోంది. హిందీ వెర్షన్ కంటే ఆలస్యంగా వచ్చినా, తెలుగు ప్రేక్షకులు దీనిని ఆదరిస్తున్నారు. బుక్ మై షోలో లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోవడంతో పాటు, మొదటి రోజు మూడు కోట్ల గ్రాస్ సాధించడంతో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్‌కు ఇది విజయవంతమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.

ఇక స్ట్రెయిట్ సినిమాల విషయానికి వస్తే, సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ 300 కోట్ల కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో విడుదలైన ‘డాకు మహారాజ్’ కూడా సూపర్ హిట్‌గా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. గత నెలలో వచ్చిన ‘తండేల్’ వంద కోట్ల గ్రాస్ అందుకోవడంతో నాగ చైతన్యకు ఇది ఊరటను అందించింది. అయితే, ‘మజాకా’, ‘బ్రహ్మ ఆనందం’, ‘రామం రాఘవం’ లాంటి భారీ అంచనాలున్నా చిత్రాలు నిరాశపరిచాయి.

డబ్బింగ్ సినిమాల దృష్టిలో చూస్తే, అజిత్ ‘పట్టుదల’ అంచనాలను అందుకోలేకపోయింది. జివి ప్రకాష్ ‘కింగ్స్టన్’ కూడా అంతగా ప్రభావం చూపించలేదు. అయినప్పటికీ, గత ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, డబ్బింగ్ చిత్రాల విజయం మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మారుతున్న ట్రెండ్ తెలుగు చిత్ర పరిశ్రమకు వార్నింగ్ బెల్ లాంటిది. మంచి కంటెంట్ అందించకపోతే, భవిష్యత్తులో డబ్బింగ్ చిత్రాలదే హవా కొనసాగే అవకాశం ఉంది.


Recent Random Post: