25 కోట్లు నష్టపోతాను కాపాడండంటూ నిర్మాత ఆవేదన

నా సినిమా రిలీజ్ కాకపోతే 25కోట్లు నష్టపోతాను.. కాపాడండి మహాప్రభో! అంటూ కోర్టు వారికి మొరపెట్టుకున్నారు ఓ ప్రముఖ నిర్మాత. తన సినిమా రిలీజ్ కాక ముందే తన హీరో నటించిన వేరొక సినిమా విడుదలైపోతోంది.. ఇది అన్యాయం! అంటూ కోర్టు గడపను కూడా తట్టాడు ఆయన. కానీ కోర్టులో అననుకూల తీర్పు వెలువడింది. కారణం ఏదైనా కానీ తన సినిమా రిలీజ్ కాక ముందే ఆ హీరో నటించిన వేరొక చిత్రం విడుదలైపోయింది ఈరోజు.

ఈ గురువారం (జూన్ 29న) విడుదలైన మామన్నన్ సినిమా ఇటీవల కొంతకాలంగా నిరంతర వార్తల్లో నిలుస్తోంది. మామన్నన్ చుట్టూ ఉన్న వివాదంపై పరిశ్రమ వర్గాల్లో విస్త్రత చర్చ సాగుతోంది. ఏంజెల్ అనే మరో సినిమా నిర్మాత మామన్నన్ స్టార్ కం నిర్మాత అయిన ఉదయనిధి స్టాలిన్ మధ్య న్యాయపరమైన వివాదం ఇటీవల రచ్చకెక్కింది.

ఏంజెల్ నిర్మాత రామశరవణన్ తన సినిమాలో నటించేందుకు స్టాలిన్ తో 2018లో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం రూ.1.25 కోట్ల పారితోషికం మాట్లాడుకోగా.. రూ.30 లక్షలు (భారత కరెన్సీ) హీరో ఉదయనిధికి అడ్వాన్స్ గా చెల్లించినట్లు తెలిపారు.

ఏంజెల్ చిత్రీకరణ చెన్నై ఫిజీ సహా పలు ప్రదేశాలలో జరుగుతోంది. అయితే COVID-19 మహమ్మారి కారణం సహా స్టాలిన్ మంత్రిగా రాజకీయాల్లోకి రావడం వల్ల అది పూర్తి కాలేదు. ఇకపై సినిమాల్లో నటించనని సూచిస్తూ ‘మామన్నన్’ తన చివరి సినిమా అని ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగా ప్రకటించడంతో రామశరవణన్ కోర్టును ఆశ్రయించారు.

ఏంజెల్ కోసం తాను ఇప్పటికే రూ.13 కోట్లు ఖర్చు చేశానని 80శాతం పనులు పూర్తయ్యాయని రామశరవణన్ కోర్టుకు తెలియజేశారు. ఏంజెల్ ను విడుదల చేయకుంటే రూ.25 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని రామశరవణన్ అభ్యర్థించారు. అయితే మద్రాసు హైకోర్టు మామన్నన్ విడుదలపై స్టే విధించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఏంజెల్ ఆలస్యానికి హీరో కారణం కాదని కోర్టు పేర్కొంది.

ఏంజెల్ చిత్రాన్ని పూర్తి చేయడానికి స్టాలిన్ తన సమయాన్ని సహకారాన్ని అందించాలని కోర్టును ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ప్రత్యేక విచారణను కూడా కోర్టు షెడ్యూల్ చేసింది. సినిమా విడుదల కాకపోతే 25కోట్లు నష్టపోతానని ఆవేదన చెందుతున్న నిర్మాతకు హీరో ఉదయనిధి సహకరిస్తారని అంతా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికి తదుపరి కోర్టు విచారణలో ఏం తేలనుందో వేచి చూడటం తప్ప నిర్మాతకు వేరే గత్యంతరం లేదు.


Recent Random Post: