40 దాటినా నంబర్ వన్ నయనతార

Share


ఏ నటికైనా వయస్సుతో పాటు అవకాశాలు తగ్గడం సహజం. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కొత్త భామల వైపు ఆసక్తి చూపుతుంటారు. కొత్త ఫేస్ ఉంటే సినిమాకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని భావిస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో మాత్రం ఈ లాజిక్ అస్సలు పని చేయదనిపిస్తుంది. లేకపోతే ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన, ఆమె తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది హీరోయిన్లు ఈ పాటికే కనుమరుగైపోయేవారు కారు.

నయనతారతో పాటు త్రిష, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫామ్‌లో కొనసాగారు. కానీ ఇప్పుడు వారికి అవకాశాలు పరిమితంగా మారాయి. అప్పుడప్పుడు ఏదైనా సినిమా లేదా యాడ్‌లో కనిపించడం తప్ప, హీరోయిన్లుగా మునుపటిలా ఇండస్ట్రీని ఏలడం లేదు. వయోభారం, మార్కెట్ మార్పులు, కొత్త తరం ఎంట్రీతో చాలామంది అవకాశాలకు దూరమయ్యారు. కొంతమంది రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు.

కానీ నయనతార ప్రయాణం మాత్రం వీరందరికీ భిన్నంగా సాగుతోంది. ఇప్పటికే 40 ఏళ్ల మైలురాయిని దాటినప్పటికీ, అవకాశాల విషయంలో ఆమెకు ఆమెనే సాటి అనిపిస్తోంది. పాత్రల ఎంపికలో, తన ఇమేజ్‌కు తగ్గ సినిమాల విషయంలో నయనతార చూపిస్తున్న క్లారిటీ ఆమెను ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో నిలబెడుతోంది.

అంతేకాదు, అవకాశాలకు తగ్గట్టే భారీ పారితోషికం కూడా అందుకుంటోంది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్ల వరకు ఛార్జ్ చేస్తూ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇంకా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో తమిళ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, తెలుగులో మాత్రం సెలెక్టివ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ హీరోలతో నటించడంలో ఆమె వెనుకాడటం లేదు.

తరువాతి తరం హీరోలతో అవకాశాలు రావడం లేదా? లేక తానే నో చెబుతోందా? అన్నది బయటికి తెలియదు. కానీ సీనియర్ హీరోల సినిమాలకు ఆఫర్ వస్తే మాత్రం నయనతార ఎప్పుడూ వెనక్కి తగ్గడం లేదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, పాత్ర నచ్చితే వెంటనే ఓకే చెబుతోంది. ఈ విషయంలో నయనతారను తప్పకుండా ప్రశంసించాలి.

బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల విషయంలో పాత్ర బలంగా ఉంటే ‘వై నాట్?’ అంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో నటిస్తోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, ఈ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోంది.

సినిమా లాంచ్ నుంచే చివరి దశ వరకు దర్శకుడు అనిల్ అడిగితే చాలు, కాదనకుండా ప్రచారానికి పూర్తి సహకారం అందిస్తోంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా నయనతార పాల్గొంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.


Recent Random Post: