
సినిమా ప్రమోషన్లలో కంటెంట్ కన్నా ఎక్కువ స్టేట్‌మెంట్లతో పబ్లిసిటీ సాధించుకున్న దర్శకుడు నరేంద్ర ఫణిశెట్టి సినిమా ‘8 వసంతాలు’ నిన్న థియేటర్లలో విడుదలైంది. కుబేరకు వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగా ఆ ప్రభావం నేరుగా ఈ సినిమాపై పడింది. ఈ విషయం ముందే గుర్తించి, ఇటీవల హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రీమియర్ ద్వారా మీడియా మరియు మూవీ లవర్స్‌కి చూపించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా కావడంతో మెరుగైన స్క్రీన్లు దక్కించుకున్నప్పటికీ, ‘8 వసంతాలు’కి కావాల్సిన ఓపెనింగ్స్ రాలేదు. చాలా చోట్ల ఆడియన్స్ సింగిల్ డిజిట్‌లో కనిపించగా, మిశ్రమమైన టాక్ వల్ల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోతోంది.
కథలో టీనేజ్ వయసులోనే పుస్తకం రాయడం ద్వారా పేరుపొందిన శుద్ధి అనే యువతి జీవితంలో ఇద్దరు అబ్బాయిలు ప్రవేశిస్తారు. ఊటీలో ప్రారంభమైన ఆమె రచన ప్రస్థానం, వరుణ్ అనే అబ్బాయి ప్రేమ వల్ల కొత్త మలుపు తిరుగుతుంది. ఆ నిర్ణయాల్లో సంజయ్ అనే మరో పాత్ర ప్రవేశిస్తుంది. ఈ ముగ్గురు మధ్య చోటుచేసుకున్న సంఘటనల సమాహారం ‘8 వసంతాలు’ కథ. పుస్తకాల్లో ఎన్ని భావోద్వేగాలు ఉన్నా, వందల కవితలున్నా వాటిని ఒక కథగా ముడిపెట్టి సినిమాగా తీర్చిదిద్దేటప్పుడు ‘పోయెటిక్ టచ్’ ఉండటం తప్ప, సినిమా మొత్తం కవితా వలె అనిపించకూడదు. నరేంద్ర ఫణిశెట్టి ఈ విషయంలో తప్పు చేశారు.
ప్రధానంగా సెకండ్ హాఫ్‌లో భావుకత ఎక్కువై, కథనం ముందుకు సాగకుండా సడలిపోతుంది. సుదీర్ఘమైన సన్నివేశాలు, లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే మాటలు, అవసరానికి మించి సందేశాల వదిలివేయడం వంటి అంశాలు ప్రేక్షకుల ఓపికను పరీక్షిస్తాయి. హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ నటన మరియు విశ్వనాథరెడ్డి అద్భుతమైన ఛాయాగ్రహణం కూడా ‘లాగ్ స్టోరీ టెల్లింగ్’ కారణంగా వృథా అయ్యాయి. టన్నుల కొద్దీ ఓపిక డిమాండ్ చేసిన ‘8 వసంతాలు’కు బాక్సాఫీస్ హిట్ కావడం కష్టమేనని అనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం.
Recent Random Post:















