60 శాతం షూటింగ్ చేశాక సినిమాను ఆపేస్తామా?

క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్‌ల క్రేజీ కాంబినేష‌న్లో మొద‌లైన ఇండియ‌న్-2 సినిమాకు ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చాయో తెలిసిందే. ఏళ్ల‌కు ఏళ్లు చ‌ర్చ‌ల త‌ర్వాత ఏడాదిన్న‌ర కింద‌ట షూటింగ్ మొద‌లుపెడితే.. క‌మ‌ల్‌కు మేక‌ప్ ప‌డ‌క ఓసారి.. నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడి మ‌ధ్య విభేదాల వ‌ల్ల మ‌రోసారి.. క‌మ‌ల్ రాజ‌కీయ క‌మిట్మెంట్ల వ‌ల్ల మ‌రోసారి.. సెట్లో జ‌రిగిన క్రేన్ ప్ర‌మాదం వ‌ల్ల ఇంకోసారి షూటింగుకి బ్రేక్ ప‌డింది. మ‌ళ్లీ కాస్త కుదురుకుని చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌దాం అనుకుంటే క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చి ప‌డింది. దీంతో ఈ సినిమా భ‌విత‌వ్యంపై సందేహాలు ముసురుకున్నాయి. ఈ సినిమా ఇక ముందుకు క‌ద‌ల‌క పోవ‌చ్చ‌ని.. పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తున్నార‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే ఈ వార్త‌ల్ని ఖండిస్తూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

ఇండియ‌న్-2ను ఆపేసే అవ‌కాశ‌మే లేద‌ని లైకా స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని.. ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి అంత సినిమా పూర్తి చేశాక ఎలా ప‌క్క‌న పెడతామ‌ని ఆ సంస్థ ప్ర‌శ్నించింది. సినిమా గురించి జ‌రుగుతున్న అబ‌ద్ధ‌పు ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని.. లాక్ డౌన్ ముగిసి సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాక చిత్రీక‌ర‌ణ పునఃప్రారంభిస్తామ‌ని లైకా సంస్థ తెలిపింది. దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. రెండు ద‌శాబ్దాల కింద‌ట సంచ‌ల‌నం రేపిన ఇండియ‌న్‌/భార‌తీయుడు చిత్రానికి కొన‌సాగింపుగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు శంక‌ర్. కొన్ని నెల‌ల కింద‌ట క్రేన్ ప్ర‌మాదంలో ముగ్గురు చ‌నిపోవ‌డంతో షూటింగ్ ఆగింది. దీనిపై పోలీస్ కేసులు, కోర్టు చిక్కుల నేప‌థ్యంలో మ‌ళ్లీ షూటింగ్ మొద‌లుపెట్ట‌లేక‌పోయారు. ఈ ప్ర‌మాదం విష‌యంలో క‌మ‌ల్‌కు, నిర్మాత‌ల‌కు విభేదాలు త‌లెత్త‌డం, వాదోప‌వాదాలు న‌డవ‌డం తెలిసిన సంగ‌తే.


Recent Random Post: