నేను బాగుంటే చాలు అనుకునే ఈ కాలంలో పది మంది బాగుంటే నేను బాగున్నట్లే అని గొప్పగా ఆలోచించిన వ్యక్తి సోనూ సూద్. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేసిన సమయంలో ఆయన పేదల తరపున నిలబడ్డారు. కరోనా వైరస్ కన్నా దాని వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది నిరుపేదల బతుకులు చితికిపోతుంటే వారిని కాపాడేందుకు దేవుడిలా దిగివచ్చి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపారు. కన్న ఊరికి దూరమై బతుకు దెరువు కోసం పట్నానికి వచ్చి చిక్కుకుపోయిన వలసజీవులను సొంత గూటికి చేర్చారు. నోరు తెరిచి సాయం అర్థించిన వారికి కాదనుకుండా అన్నీ చేసుకుంటూ పోయారు.
అయితే ఇలా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ పోవడానికి ఆయన ఎంతగానో ఖర్చు చేశాడు. దీనికోసం తన ఆస్తులను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. ముంబైలోని జుహులో ఎనిమది ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10 కోట్లు సేకరించినట్లు సమాచారం. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. సోనూసూద్ తన రెండు షాపులు, ఆరు ఫ్లాట్స్‌ను తాకట్టు పెట్టి రూ.10 కోట్లు అప్పు తీసుకున్నారట. దీనికి సంబంధించి సెప్టెంబర్ 15న అగ్రిమెంట్లపై ఆయన సంతకం చేయగా, గత నెల 24న రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిందట. ఈ విషయాన్ని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ రితేశ్ మెహతా ధ్రువీకరించారు. ఇప్పటికీ సాయం కోసం ఆయనకు ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వినతులు వస్తూనే ఉన్నాయి. వారందరి కష్టాలను తీరుస్తానంటున్నాడీ హీరో.
Recent Random Post: