అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి: సీరత్‌ కపూర్

అమ్మాయంటే వంచిన తల ఎత్తకూడదు, గట్టిగా నవ్వకూడదు, నచ్చిన జాబ్‌ చేయకూడదు… మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఇలాంటి ఆంక్షలు కూడా చాలావరకూ తగ్గాయి. అయితే ఇంకా కొన్ని చోట్ల స్వేచ్ఛ లేని అమ్మాయిలను చూస్తున్నాం. ‘‘అమ్మాయిలకు హద్దులు పెట్టొద్దు.. స్వేచ్ఛ ఇవ్వండి’’ అంటున్నారు హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌. మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నప్పుడు జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేసుకున్నారామె.

ఆ విషయం గురించి సీరత్‌ కపూర్‌ మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు మా స్కూల్‌లో ఆర్ట్‌ కాంపిటీషన్‌ జరిగింది. నేను ఒక అమ్మాయి బొమ్మ గీశాను. అమ్మాయి చేతులు ముడుచుకున్నట్లుగా ఉన్న ఆ బొమ్మను చూసి, మా అమ్మగారు ‘సిరీ… అలా చేతులు ముడుచుకోకూడదు. హద్దులెందుకు? ఫ్రీగా వదిలేయాలి’ అన్నారు. అమ్మ మాటల్లో ఎంతో అర్థం ఉంది. అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వాలని ఆ విధంగా చెప్పారు మా అమ్మ. కానీ ఆ ప్రైజ్‌ కన్నా విలువైన విషయాన్ని మా అమ్మ చెప్పారు. ‘ఇలా ఉండకూడదు… అలా చేయకూడదు’ అని మా ఇంట్లో నాకెప్పుడూ ఆంక్షలు విధించలేదు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను’’ అన్నారు.

అన్నట్లు.. . ‘రన్‌ రాజా రన్‌’, ‘టైగర్‌’, ‘రాజుగారి గది 2’, ‘టచ్‌ చేసి చూడు’ వంటి చిత్రాల్లో నటించిన సీరత్‌ చేసిన హిందీ చిత్రం ‘మారీచ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. 2014లో విడుదలైన ‘జిద్‌’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన సీరత్‌ ఆరేళ్ల తర్వాత చేసిన హిందీ చిత్రం ఇది.


Recent Random Post: