ఆ జగన్.. ఈ జగన్ ఒక్కరేనా.? ఆత్మగౌరవం అస్సలు పట్టదా.?

పార్టీ తనను అవమానించిందని తనను ఎంపీని చేసిన కాంగ్రెస్ పార్టీని కాదనుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, ఈ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని, అక్రమాస్తుల కేసులతో సావాసం చేస్తూ, ఎలాగైతేనేం, రాజకీయాల్లో అనుకున్నది సాధించారు. మాట తప్పడు.. మడమ తిప్పడు.. ఎవరి ముందూ తల వంచడు.. అటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటుంటారు.

కానీ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నర రూప రాక్షసుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు విమర్శిస్తోంటే, ‘నాకేంటి సంబంధం..?’ అన్నట్టు లైట్ తీసుకున్నారు వైఎస్ జగన్. తన తండ్రిని అంత దారుణంగా కించపరుస్తోంటే, వైఎస్ జగన్ ఎదురుదాడి చేయాలి కదా.?

సరే, తెలంగాణ రాష్ట్ర సమితితో రాజకీయంగా ‘అవగాహన’ వుంది కాబట్టి, ఆ అవగాహనే, 2019 ఎన్నికల్లో వైసీపీకి ఉపయోగపడింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఏ విమర్శ వచ్చినా, వైఎస్ జగన్ లైట్ తీసుకోవచ్చేమో. కానీ, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మాటేమిటి.? లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే, ఆంధ్రలో పుట్టినోళ్ళెవరూ తెలంగాణ బాగుని కోరుకోరంటూ తెలంగాణ నాయకులు విమర్శించినప్పుడన్నా రాష్ట్రం తరఫున వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో వకాల్తా పుచ్చుకోవాలి కదా.? కానీ, వైఎస్ జగన్ నోరు మెదపడంలేదు.

తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్.. ఇంకోసారి పదునైన మాటల్ని వదిలేశారు. ‘ఆంధ్రా.. దాదాగిరీ చేస్తోంది..’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీయార్. ఏపీ వైపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, ‘దాదాగిరీ అంటే, 30 టీఎంసీల నీళ్ళని వృధాగా సముద్రంలోకి వదిలెయ్యడమే కదా..’ అంటూ ఎద్దేవా చేసి ఊరుకున్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శల్ని వైఎస్ జగన్ లైట్ తీసుకోవచ్చుగాక.. అది కుటుంబ వ్యవహారమని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ నుంచి విమర్శల దాడి జరుగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వుంది.

‘రాష్ట్రమెలా అవమానాల పాలైతే నాకేం.? నాకు ముఖ్యమంత్రి పదవి వుంది.. ఆ పదవిలో నేను నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తాను..’ అని వైఎస్ జగన్ అనదలచుకుంటే, చెయ్యడానికేమీ లేదు. ఇంతకీ, ఒకప్పటి వైఎస్ జగన్, ఇప్పటి వైఎస్ జగన్.. ఇద్దరూ ఒకరేనా.? లేదంటే, అప్పటికీ ఇప్పటికీ.. వైఎస్ జగన్ అనే వ్యక్తి నైతికతలో, పౌరుషంలో పోల్చలేనంత మార్పు వచ్చేసిందా.?


Recent Random Post: