వెండితెరపై వెన్నెల శిల్పం శ్రీదేవి

తెలుగు తెరకు ఎంతోమంది కథానాయికలు తమ అందచందాలను పరిచయం చేశారు. అందమైన అభినయంతో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. సావిత్రి .. జమున .. కృష్ణకుమారి కొంతకాలంపాటు తెలుగు తెరను ఏలేస్తే కాంచన .. శారద .. వాణిశ్రీ మరికొంతకాలం పాటు తమ జోరును చూపించారు. ఆ తరువాత అటు అందం .. ఇటు అభినయం పుష్కలంగా ఉన్న ముగ్గురు కథానాయికల మధ్య సుదీర్ఘ కాలం పాటు పోటీ కొనసాగింది. ఆ కథానాయికలే జయసుధ .. జయప్రద .. శ్రీదేవి.

అందం పరంగాను .. అభినయం పరంగాను ఈ ముగ్గురుకీ ఏ మాత్రం వంకబెట్టలేం. అందం విషయంలో జయప్రదకు .. అభినయం విషయంలో జయసుధకు శ్రీదేవి పోటీగా నిలిచిందనే టాక్ అప్పట్లో బలంగా వినిపించేది. ఇక బాలనటిగా కెరియర్ ను మొదలుపెట్టడం .. బాలీవుడ్ లో చక్రం తిప్పేయడం వంటి విషయాలకొస్తే శ్రీదేవికి ఎక్కువ మార్కులు పడతాయి. సౌత్ నుంచి ఒకమ్మాయి నార్త్ కి వెళ్లి అక్కడ ఎదురులేని విధంగా దూసుకెళ్లడం .. తిరుగులేని విజయాలను అందుకోవడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు. అరుదైన ఆ విషయం ఒక్క శ్రీదేవి విషయంలోనే జరిగింది.

సాధారణంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినవారిలో ఆ తరువాత హీరోయిన్ అనిపించుకున్నవారు చాలా తక్కువమంది. కానీ శ్రీదేవి తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మురిపించారు. మళ్లీ ఈ భాషలన్నింటిలోను కథానాయికగా అలరించారు. ముఖ్యంగా తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్నారు. తమిళంలో రజనీ .. కమల్ సరసన ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్లే. ఇక తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబులతో వరుస సినిమాలు చేశారు. ఆమె ఏ హీరోతో జోడీ కడితే ఆ హీరోతో ‘హిట్ పెయిర్’ అనిపించేలా ఉండేవారు.

ఇక ఆ తరువాత చిరంజీవి .. నాగార్జున .. వెంకటేశ్ లతోను శ్రీదేవి భారీ హిట్లు అందుకున్నారు. చిరూ జోడీగా చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ .. నాగ్ సరసన చేసిన ‘ఆఖరి పోరాటం’ .. ‘వెంకీ జోడీగా చేసిన ‘క్షణక్షణం’ సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా తరువాత నిజంగానే ఆమెనే అతిలోక సుందరి అనే విషయాన్ని అంతా ఒప్పుకున్నారు. ఇంకా హిందీలోను ఆమె జితేంద్ర .. మిథున్ చక్రవర్తి .. అనిల్ కపూర్ లతో ఎక్కువ సినిమాలు చేశారు.

శ్రీదేవి మంచి పొడగరి .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. అందువలన ఇటు మోడ్రన్ డ్రెస్ లలోను .. అటు చీరకట్టులోను ఆమె ప్రేక్షకుల మనసులను దోచేశారు. ఆమె కళ్లు నవరసాలను ఆరబోసిన వాకిళ్ల మాదిరిగా అనిపించేవి. ఆమె మాట పున్నమి వెన్నెల్లో జలతారును మీటినట్లుగా వినిపించేది. ఆమె చిలిపి చూపులు .. కొంటె నవ్వులు .. దోర సిగ్గులను గుండె గూట్లో దాచేసుకున్న కుర్రాళ్లు ఎందరో. వాళ్లంతా ఇప్పటికే శ్రీదేవి అభిమానులే .. ఆరాధకులే. అంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్న శ్రీదేవి జయంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆమెను స్మరించుకుందాం.


Recent Random Post: