తెలుగు సినీ పరిశ్రమ, కరోనా పాండమిక్ నేపథ్యంలో అతి దారుణమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సినిమా అంటేనే కోట్లాది రూపాయల ఖర్చు. సకాలంలో సినిమాని విడుదల చేయడమంటే అది ఏ నిర్మాతకి అయినా ప్రసవ వేదనతో సమానమే. సినిమా అంటే కేలం హీరోలు, హీరోయిన్లు కాదు. నిర్మాత, దర్శకుడు, బోల్డంతమంది కార్మికులు.. ఇలా పెద్ద తతంగమే వుంటుంది.
సినిమా నిర్మాణానికి ముందు.. నిర్మాణ సమయం.. నిర్మాణం పూర్తయ్యాక విడుదల.. ఇలా ప్రతి ఘట్టం.. దేనికదే అత్యంత కష్టమైనది. సినీ పరిశ్రమ ద్వారా ప్రభుత్వాలకు పెద్దయెత్తున పన్నులు అందుతాయి. అయినా, సినీ పరిశ్రమని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు.. ‘మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో..’ అంటూ పరిశ్రమ పెద్దలు, రెండు చేతులూ జోడించి ప్రభుత్వాల్ని వేడుకునే పరిస్థితి ఎందుకొచ్చింది.?
సినిమా రంగంలో సక్సెస్ రేటు చాలా చాలా తక్కువ. ఫ్లాప్ సినిమాని కూడా హిట్టు సినిమా.. అని చెప్పుకోక తప్పదు. తద్వారా తదుపరి సినిమాకి మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచన దర్శకుడు, నిర్మాత, నటీనటులు.. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తారు. అదే ఘోర తప్పిదంగా తయారైంది. చాలా తక్కువ సక్సెస్ రేట్ తెలుగు సినీ పరిశ్రమలో వున్నా.. మొత్తంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే.. ఆ విషయంలో తెలుగు సినిమానే బెటర్.
నటీనటుల్లో కొందరి రెమ్యునరేషన్ 50 కోట్లు టచ్ చేస్తున్న మాట వాస్తవం. అలాగని అందరూ అదే స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారనంటే ఎలా.? 50 కోట్లు తీసుకునే హీరో, పరిస్థితిని బట్టి.. అందులో సగం వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. మొత్తంగా తన రెమ్యునరేషన్ అంతా వదులుకోవాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భాల్ని గతంలో చాలానే చూశాం. ఇవన్నీ ‘ఎగతాళి’ చేసేవారికి కనిపించవుగాక కనిపించవు.
మద్యం రేట్లు పెరుగుతాయ్.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయ్, కరెంటు ఛార్జీలు పెరుగుతాయ్.. సినిమా టిక్కెట్ల రేట్లు మాత్రం పెరగవ్. ఇదెక్కడి వైపరీత్యం.? సినిమా టిక్కెట్ల ధరలు సామాన్యులకు అందుబాటులో వుండాల్సిందే.. బ్లాక్ మార్కెటింగ్‌కి అడ్డుకట్టపడాల్సిందే. కానీ, ఆ పేరు చెప్పి, పరిశ్రమ గొంతు నొక్కేస్తే ఎలా.? అయినా, ‘మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో..’ అని చిరంజీవి ఒక్కరే బతిమాలుకుంటే ఎలా.?
పరిశ్రమలో ఇంకెవరూ గొంతు విప్పరా.? పరిశ్రమ బాగు కోసం, బాధ్యతను భుజానికెత్తుకున్న చిరంజీవిని ట్రోల్ చేసే వారెవరైనా.. రాజకీయం ఎలా ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తోందో తొలుత ఆలోచించుకోవాలి.
Recent Random Post: