ట్రైలర్: గోపీచంద్ యాక్షన్ ప్యాక్డ్ పవర్ ఫుల్ ‘ఆరడుగుల బుల్లెట్’

మ్యాచో స్టార్ గోపీచంద్ – లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రం ”ఆరడుగుల బుల్లెట్”. మాస్ డైరెక్టర్ బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ చిత్రానికి మోక్షం లభిస్తోంది. అక్టోబర్ 8న ఈ మూవీని థియేట్రికల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

‘పేరు శివ.. పుట్టింది బెజవాడ.. పెరిగింది హైదరాబాద్.. పరిచయమైతే నేను మర్చిపోను.. పంగా అయితే నువ్వు మర్చిపోలేవ్’ అని గోపీచంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. పనీ పాటా లేకుండా తిరుగుతూ తండ్రితో తిట్లు తినే కుర్రాడిగా హీరో క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేశారు. గోపీచంద్ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించారు. ‘పోషించలేని వాడికి ప్రేమ ఎందుకు? పని తినే వాడికి పౌరుషం ఎందుకు?’ అంటూ దెప్పి పొడుస్తున్నాడు. అవేమీ పట్టించుకోని గోపీచంద్ ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు.

అయితే విలన్ అభిమన్యు సింగ్ వల్ల తన తండ్రికి సమస్య ఎదురవడంతో గోపీచంద్ క్యారక్టర్ మరో టర్న్ తీసుకుంది. తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లే కొడుకు విలన్స్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఏమేమి చేసాడు అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. బి గోపాల్ గత చిత్రాల తరహాలోనే ‘ఆరడుగుల బుల్లెట్’ ని కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. నయన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. బాల మురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు.

‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రానికి దర్శక రచయిత వక్కంతం వంశీ కథ – స్క్రీన్ ప్లే అందించారు. అబ్బూరి రవి దీనికి డైలాగ్స్ రాశారు. కోట శ్రీనివాసరావు – బ్రహ్మానందం – జయ ప్రకాష్ రెడ్డి – చలపతిరావు – రమా ప్రభ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ‘సీటీమార్’ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన గోపీచంద్.. ఇప్పుడు నాలుగేళ్ళ క్రితం నాటి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Recent Random Post: