నాగబాబు కు ఇదేమీ మొదటిసారి కాదులేండి..!

టాలీవుడ్ లో హోరాహోరీగా జరిగిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీపడిన మంచు విష్ణు – ప్రకాశ్ రాజ్ లలో విష్ణు దే పైచేయి అయింది. మొత్తం 18 కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్ కు చెందిన అభ్యర్థులు విజయం సాధించగా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8 మంది గెలుపొందారు. అయితే ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓటమిని ‘మెగా’ ఫ్యామిలీ ఓటమిగా విశ్లేషిస్తూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

‘మా’ ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్న చిరంజీవి ఎక్కడా ప్రకటించలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు కాబట్టి.. ఇలాంటి స్టేట్మెంట్స్ కి దూరంగా ఉండటం సహజమే. కాకపోతే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ప్రకాష్ రాజ్ కే మెగా ఫ్యామిలీ మద్దతు.. అన్నయ్య చిరంజీవి అండదండలు కూడా ఉన్నాయంటూ మీడియా ముఖంగా పదే పదే చెబుతూ వచ్చారు.

చిరు ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్న విలక్షణ నటుడు కూడా తనకు ‘మెగా’ సపోర్ట్ ఉందని చెప్పుకోలేదు. కానీ నాగబాబు మాత్రం విష్ణు ప్యానల్ సభ్యులు చిన్న ఆరోపణ చేసినా వెంటనే స్పందించడం.. ప్రత్యర్థులపై విరుచుకు పడటం చేస్తూ వచ్చారు. ఎన్నికల ముందు రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మెగా మద్దతు ప్రకాష్ రాజ్ కే అని ప్రకటించారు. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు కొన్నేళ్లపాటు సేవ చేసిన సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు – బాబు మోహన్ వంటి వారి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఊడిపోతారో తెలియని వ్యక్తి అంటూ తన స్థాయిని తగ్గి మాట్లాడారు.

అంతేకాదు ప్రకాష్ రాజ్ కే తన మద్దతు అని స్ట్రాంగ్ గా చాటిచెప్పాలని గతంలో అతన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్స్ కూడా డిలీట్ చేశారు నాగబాబు. ఇంత చేసినా ‘మా’ అధ్యక్షుడుగా తను సపోర్ట్ చేసిన వ్యక్తి అధ్యక్షుడుగా గెలవకపోవడంతో ఏకంగా ‘మా’ సభ్యత్వానికే రాజీనామా చేశారు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని నాగబాబు సెలవు ప్రకటించారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజమనే సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ‘మా’ ఎన్నికలల్లో తాను సపోర్ట్ చేసిన అభ్యర్థి అధ్యక్షుడుగా గెలవలేదని రాజీనామా చేయడం సరైన నిర్ణయం కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం. గతంలో ‘మా’ లో ఎన్నో ఏళ్లుగా సభ్యుడిగా ఉండి.. గతంలో ప్రెసిడెంట్ గా చేసిన నాగబాబు.. ఇలా రాజీనామా చేసి ఇంక పోరాటం చేయలేనని చేతులెత్తేయడాన్ని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కులసంఘాలతో మీటింగ్ పెట్టి అన్నయ్య కు ఇబ్బందులు తెచ్చిపెట్టాడని.. ఇప్పుడు ‘మా’ వ్యవహారంలో కూడా చిరంజీవి కి క్యాండిడేట్ ఓడిపోయారనే విధంగా భావించేలా చేసారని కామెంట్స్ చేస్తున్నారు.

పోరాడలేక పలాయనం చిత్తగించడం నాగబాబు కు ఇదేమీ మొదటిసారి కాదని.. జనసేన పార్టీ నరసాపురం ఎంపీగా పోటీచేసి ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ‘మా’ ఎన్నికల విషయంలో కూడా ముందు నుంచి హడావిడి చేసి చివరకి చిరంజీవి అభ్యర్థి ఓటమి పాలయ్యారనే నేమ్ వచ్చేలా చేశారు. ‘మా’ సభ్యుల మీద కోపంతోనే.. ప్రకాష్ రాజ్ ఒడిపోయారనే బాధ తోనో.. ఆవేశంలోనో రాజీనామా నిర్ణయం తీసుకొని పోరాటం తన వల్ల కాదన్నట్లు వెనకడుగు వేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Recent Random Post: